అంబరాన్నంటే సంబురానికి ముహూర్తం సమీపించింది. కీకారణ్యం జనారణ్యంగా మారే సమయం వచ్చేసింది. రేపట్నుంచి వనమంతా జనం కాగా, మేడారం జాతర ఘనంగా ప్రారంభం కానుంది. మేడారం మహా జాతరలో తొలి ఘట్టం పగిడిద్ద రాజు ఆగమనం... మహబూబాబాద్ జిల్లా గంగారాం మండలం పూనుగొండ్లలో కొలువైన పగిడిద్దరాజును అటవీ మార్గం ద్వారా మేడారానికి ఈ మధ్యాహ్నం పూజారులు తీసుకుని రానున్నారు.
కొండయి నుంచి గోవిందరాజు..
పూనుగొండ్ల నుంచి డప్పు వాయిద్యాల నడుమ అత్యంత భక్తి శ్రద్ధలతో 66 కిలోమీటర్ల దూరంలో ఉన్న మేడారానికి పడుగ రూపంలో ఉన్న పగిడిద్ద రాజు ఈ ఉదయం 12 గంటలకు బయలుదేరనున్నారు. వీళ్ళ ప్రయాణం అంతా అటవీప్రాంతంలో కాలినడకన సాగుతుంది. రేపు ఉదయం కొండయి నుంచి గోవిందరాజు, కన్నెపల్లి నుంచి సారలమ్మ గద్దెల పైకి చేరుకోగా.. జాతర ప్రారంభమవుతుంది.
సర్వం సన్నద్ధం..
జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇక్కట్లు లేకుండా అధికారులు సర్వసన్నద్ధమయ్యారు. వృద్ధులకు, దివ్యాంగుల సౌకర్యార్థం పర్యావరణ హితమైన బ్యాటరీ ఆటోలను ఏర్పాటు చేశారు. మొత్తం జాతర ప్రాంతాన్ని 38 సెక్టార్లుగా విభజించి విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. 2వేల ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు పూర్తి చేశారు.
క్యూ లేన్లలలో తోపులాటలు లేకుండా పటిష్ఠ చర్యలు చేపట్టారు. భక్తులకు గాయాలు కాకుండా ఉండేందుకు గద్దెల లోపలికి ఎవరిని అనుమతించట్లేదని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ప్లాస్టిక్ వస్తువులు తీసుకురాకుండా జాతరకు వచ్చి పర్యావరణాన్ని కాపాడాలని కలెక్టర్ భక్తులకు విజ్ఞప్తి చేశారు.
కొనసాగుతోన్న రద్దీ..
మేడారంలో భక్తుల రద్దీ యధావిధిగా కొనసాగుతోంది. తెల్లవారు జాము సైతం భక్తులు తల్లుల దర్శనానికి తరలివచ్చారు. సమ్మక్క- సారలమ్మలను తనివితీరా దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.
ఇదీ చూడండి:- నిరసనలు ఆకస్మికం కాదు.. విపక్షాల ప్రయోగం: మోదీ