- రాయదుర్గం సమీపంలోని గేటెడ్ కమ్యూనిటీలో ఓ మహిళకు కరోనా వచ్చింది. అక్కడి వారు అండగా ఉంటామంటూ భరోసా ఇచ్చారు. ఓ వీడియో సందేశం రూపొందించారు. ఏ అవసరమొచ్చినా ఆదుకొనేందుకు సిద్ధమని, త్వరగా కోలుకోవాలని సంక్షిప్త వీడియోల ద్వారా ఆకాంక్షించారు. ఏ సాయం అవసరమైనా తక్షణం అందించారు. ఇరుగూ.. పొరుగూ కొండంత అండతో ఆమె కోలుకున్నారు.
- నాగారంలోని ఓ అపార్టుమెంట్‌లో విదేశాల నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా సోకింది. కుటుంబసభ్యులు క్వారంటైన్‌లో ఉండడంతో అపార్టుమెంట్ వాసులు వారికి అండగా నిలిచారు. అవసరమైన నిత్యావసరాలు గుమ్మం వద్దకే చేరవేశారు. ఎలాంటి ఇబ్బంది లేకుండానే బాధితుడు కోలుకున్నాడు.
- మణికొండలోని మరో గేటెడ్ కమ్యూనిటీలో నివసించే దంపతులిద్దరికీ వైరస్ సోకింది. ఆ గేటెడ్ కమ్యూనిటీ మొత్తం వారికి సాయంగా ఉండాలని తీర్మానించారు. ఒక్కొక్కరు ఒక్కో సాయం చేయడంతో ఆ ఇద్దరూ వారంలోనే కరోనాను జయించారు.
కరోనా బాధితులను, వారి కుటుంబాలను కొందరు సామాజికంగా బహిష్కరిస్తుండగా.. మరికొన్ని చోట్ల మేమున్నామంటూ దూరం నుంచే సాయం అందిస్తున్నారు. తోటివారు బాధలో ఉన్నారని తెలుసుకుని జాలి చూపించడమే కాకుండా, త్వరగా కోలుకొనేందుకు తమ వంతు చేయూతనందిస్తున్నారు.
స్పందిస్తున్న గేటెడ్ కమ్యూనిటీల వాసులు
కరోనా బాధిత కుటుంబాలకు గేటెడ్ కమ్యూనిటీల్లో ఉండేవారు, అపార్ట్‌మెంట్ల వారు తమవంతుగా చేయూతనిస్తున్నారు. నగర శివారుల్లో చాలాచోట్ల గేటెడ్ కమ్యూనిటీలు, అపార్టుమెంట్లు వెలిశాయి. కొన్నిచోట్ల 50-60 కుటుంబాలు, మరికొన్ని చోట్ల 100-120 కుటుంబాలు నివసిస్తున్నాయి. స్థానిక సమస్యల పరిష్కారానికి, పండగలు జరుపుకోవడానికి గతంలో సంఘటితమయ్యారు. అదే స్ఫూర్తిని కరోనా కష్టకాలంలోనూ కొనసాగిస్తూ ఎడం పాటిస్తూనే సాయం చేస్తున్నారు. సంక్షిప్త సందేశాల రూపంలో బాధితుల్లో ధైర్యాన్ని నూరిపోస్తున్నారు. వాలంటీర్లుగా ఏర్పడి బాధిత కుటుంబాలకు అవసరమైనవి సమకూర్చుతుండగా.. చెల్లింపులన్నీ ఆన్‌లైన్‌లో జరిగిపోతున్నాయి. ఈ స్ఫూర్తిని అందరూ అందిపుచ్చుకుంటే కరోనాను సమష్టిగా జయించవచ్చని చాటుతున్నారు.
ఇదీ చూడండి:మహారాష్ట్రలో ఒక్కరోజే కరోనాతో 258 మంది మృతి