అధికార, ప్రతిపక్షాల విమర్శలతో నగర, పురపాలికల్లో ప్రచార వేడి పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వాంబే కాలనీలోని 60వ డివిజన్ వైకాపా అభ్యర్థి బేవర సూర్యమణి తరఫున మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రచారం నిర్వహించారు. వివిధ పార్టీలకు చెందిన 300 మంది కార్యకర్తలు కొడాలి నాని సమక్షంలో వైకాపాలో చేరారు. విజయవాడలో 600 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి వివరించారు. గుంటూరు శ్యామలానగర్ 36వ వార్డులో జనసేన-భాజపా అభ్యర్థి తరఫున ఆ పార్టీ నేతలు కన్నా లక్ష్మీనారాయణ ప్రచారం నిర్వహించారు. రెండు ప్రాంతీయ పార్టీలు స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశాయని ఆరోపించారు. జనసేన-భాజపాకు అవకాశమిస్తే అవినీతి రహిత అభివృద్ధి చేసి చూపుతామన్నారు.
జోరు పెంచారు..
జీవీఎంసీ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా అన్ని పార్టీల అభ్యర్థులు... ప్రచారంలో జోరు పెంచారు. విశాఖ 22వ వార్డు వైకాపా అభ్యర్థి పీతల గోవింగ్ ఇంటింటి ప్రచారం ద్వారా... ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. 29వ డివిజన్‌లో భాజపా అభ్యర్థితో కలిసి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రచారం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లు అడిగారు. అనకాపల్లిలో 81వ వార్డు తెలుగుదేశం అభ్యర్థి మళ్ల కృష్ణకుమారి ఆధ్వర్యంలో పలువురు యువకులు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం 27వ వార్డులో....వైకాపా అభ్యర్థి ప్రచారం చేశారు.
ఓట్లు కోసం పాట్లు..
అనంతపురంలో పురపోరు ప్రచారం వాడీవేడిగా సాగుతోంది. కళ్యాణదుర్గంలోని 7వ వార్డులో ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఉషశ్రీచరణ్.. ఓ హోటల్‌లో దోశలు వేసి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ధర్మవరంలోని పదో వార్డు వైకాపా అభ్యర్థి నాగరాజు తరఫున పట్టణ ఆర్యవైశ్య సంఘం నాయకులు ప్రచారం చేశారు. గుత్తిలోని 22వ వార్డు వైకాపా అభ్యర్థి సులోచనతో కలిసి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారం చేశారు. కదిరిలోని రెండో వార్డు కౌన్సిలర్‌గా భాజపా తరఫున గతంలో నామినేషన్ వేసిన రామకృష్ణ అనారోగ్యంతో మృతి చెందగా...ఆయన స్థానంలో నాగరాజు బరిలో నిలిచారు. మద్దతుదారులతో కలిసి ఆయన రిటర్నింగ్ అధికారికి నామపత్రాలు సమర్పించారు.
ఇదీ చదవండి: ప్రజాస్వామ్యం కోసం రాజీ లేని పోరు