Fake Call Center Fraud : హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పేట్ బషీరాబాద్ ప్రధాన రహదారిపై ఉన్న యారో ఎస్టేట్‌లో పేరు లేకుండా కాల్‌సెంటర్ నడుపుతున్నారని.. అమెజాన్ కస్టమర్ సర్వీర్ అని మాట్లాడుతున్నారని పోలీసులకు చెప్పాడు. అతడి నుంచి తీసుకున్న సమాచారంతో ఎస్‌వోటీ పోలీసులతో కలిసి పేట్ బషీరాబాద్ పోలీసులు కాల్ సెంటర్‌పై దాడులు నిర్వహించారు. కాల్ సెంటర్‌లో పని చేస్తున్న వారిని వివరాలు అడగగా.. పొంతనలేని సమాధానం చెప్పడంతో నకిలీ కాల్ సెంటర్‌గా గుర్తించారు.
Fake Call Center Fraud in Hyderabad : బీటెక్ పూర్తి చేసిన హన్మకొండకు చెందిన బిరె ప్రమోద్‌కుమార్ రెడ్డి లండన్‌లో ఎంఎస్ చేశాడు. అక్కడే ఓ సూపర్ మార్కెట్ నడుపుతూనే.. విదేశాల్లో చదువుకునే వారి కోసం కన్సల్టెన్సీని నడిపాడు. ఈ క్రమంలోనే రమేశ్ అనే వ్యక్తి ప్రమోద్‌కు పరిచయం అయ్యాడు. మన దేశంలో వారి కన్నా విదేశాల్లో ఉండే వారిని మోసం చేస్తే పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదిచ్చవచ్చని ప్రమోద్ పథకం రచించాడు.
ఇందుకు కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలనుకున్నాడు. ఈ విషయాన్ని చిన్ననాటి స్నేహితుడు అజయ్‌కు చెప్పగా.. పేట్ బషీరాబాద్‌లోనే ఏర్పాటు చేయాలని అతడు చెప్పాడు. ఇందుకోసం అజయ్.. అతనికి పరిచయం ఉన్న రామకృష్ణ సహాయం తీసుకున్నాడు. 10 రోజుల క్రితం యారో ఎస్టేట్ భవనంలో మొదటి అంతస్థులో ఓ భాగాన్ని అద్దెకు తీసుకున్నారు. మోసం చేసేందుకు ప్రమోద్ ఆస్ట్రేలియాను ఎంచుకోగా.. ఆ దేశ పౌరుల వివరాలను కోల్‌కతాకు చెందిన ఆకాశ్, లెస్లీ నుంచి సేకరించాడు.
వారే టార్గెట్..: రమేశ్ కుమార్, శబ్రీష్ ద్వారా గతంలో కాల్ సెంటర్ నిర్వహణలో అనుభవం ఉన్న వారిని ప్రమోద్ సిబ్బందిగా నియమించాడు. అప్పటికే సేకరించిన ఆస్ట్రేలియా పౌరుల నంబర్లకు ఫోన్లు చేసి.. అమెజాన్ సబ్‌స్క్రిప్షన్ హ్యాక్ అయిందని చెప్పేవారు. తమకు అకౌంట్ లేదని చెప్పేవారి ఫోన్లు కట్ చేసి.. ఉందనే వారికి మాత్రం మీ అకౌంట్ హ్యక్ అయిందని చెప్పేవారు. మీ ఖాతాను వేరే వాళ్లు వాడుతున్నారని మొదట టెలీకాలర్స్ చేత చెప్పించి.. ఆపై సూపర్‌వైజర్ మాట్లాడతారంటూ ప్రమోద్‌కు కలిపేవారు. ఇంగ్లీష్ యాక్సెంట్ బాగా రావడంతో ఆస్ట్రేలియా పౌరులను నెమ్మదిగా ఉచ్చులోకి దింపేవాడు. అకౌంట్ వేరే డివైస్ నుంచి తీసేయడానికి లేదా హ్యాక్ అవ్వకుండా ఉండటానికి రూ.1000 ఆస్ట్రేలియన్ డాలర్లు ఖర్చు అవుతుందని చెప్పేవాడు.
గిఫ్ట్ కార్డుల రూపంలో..: ఇందుకు యూపీఐ లింక్‌తో కూడిన సందేశాన్ని వారికి పంపేవాడు. దీనిని క్లిక్ చేసి పేమెంట్ చేసేందుకు ప్రయత్నించినపుడు వారి ఫోన్ ఆధీనంలోకి తీసుకునేవారు. ఇలా ఓ బాధితుడిని మోసం చేసే క్రమంలో సమస్యాత్మక లావాదేవి కారణంగా బ్యాంకు వారి ఖాతాను నిలిపివేసింది. తమ కుట్ర ఫలించకపోవడంతో.. అమెజాన్ గిఫ్ట్ కార్డుల రూపంలో మరో పథకాన్నిసిద్ధం చేశారు. గిఫ్ట్ కార్డులను ఆస్ట్రేలియాలోని వారి స్నేహితుల ఖాతాల్లో రీడిమ్ చేసి ఆ డబ్బును వీరు మన దేశ ఖాతాల్లోకి మళ్లిస్తున్నారు. ఇలా జరుగుతున్న క్రమంలో ఓ వ్యక్తి డయల్ 100కి ఇచ్చిన సమాచారంతో నకిలీ కాల్ సెంటర్ గుట్ట రట్టయింది. ప్రధాన నిందితుడు బిరె ప్రమోద్ సహా పోలీసులు 13 మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 14 కంప్యూటర్లు, హార్డ్ డిస్క్‌లు, 8 సిమ్ కార్డులు, ఫార్చునర్ కారు, రూ.6 వేల నగదు స్వాధీనం చేసుకుని.. పోలీసులు వారిని రిమాండ్‌కు తరలించారు.
ఇవీ చూడండి..
భర్తను హత్యచేసి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన భార్య.. ఆతర్వాత ఏమైదంటే
'పది' పరీక్షలు.. ప్రతి కేంద్రంలో సిట్టింగ్ స్వ్కాడ్.. ఆ ఇన్విజిలేటర్ల తొలగింపు