కాంగ్రెస్ పార్టీపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చేసిన విమర్శలను ఆ పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. ప్రశాంత్ కిషోర్ ఒక రాజకీయ దళారీ అని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఆరోపించారు. ఆయనొక అద్దె మైకు లాంటి వాడని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అంటే ఒక ఐడియాలజీ అని పేర్కొన్న మల్లు రవి... ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి ఐడియాలజీ లేని వ్యక్తి అని ఆరోపించారు. ఎవరు డబ్బులు ఇస్తే వారి తరుపున పనిచేసే వ్యక్తి అని ధ్వజమెత్తారు.
ప్రశాంత్ కిషోర్ స్థాయిని మించి కాంగ్రెస్‌పై విమర్శలు చేశారని మల్లు రవి ధ్వజమెత్తారు. దేశ ప్రజల డీఎన్ఏలోనే సెక్యులరిజం ఉందని... అందుకు అనుగుణంగా కాంగ్రెస్ పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. దేశం కోసం పనిచేస్తున్న నాయకుడు రాహుల్ గాంధీ అని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలోనే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. ఇప్పటికైనా ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్‌పై విమర్శలు మానుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. భాజపా అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్నారని ఆరోపించిన మల్లు రవి మోదీ హయాంలో అన్ని నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీపై ప్రశాంత్ కిశోర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రశాంత్ కిషోర్ ఒక రాజకీయ దళారీ. ఎవరు డబ్బులు ఇస్తే వారి తరుపున పనిచేసే వ్యక్తి. కాంగ్రెస్ పార్టీ అంటే ఒక ఐడియాలజీ ఉన్న పార్టీ. అలాంటి పార్టీని ఒక ఐడియాలజీ లేని వ్యక్తి విమర్శించడం సరికాదు.-మల్లు రవి, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు
ఇదీ చదవండి: YS Sharmila Padayatra 2021: ప్రజల ప్రతి సమస్యా.. నా సమస్యే: వైఎస్ షర్మిల