న్యాయం కోసం ఓ మహిళ ఎస్హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేసింది. తన తల్లిదండ్రులు అంబర్‌పేటలో నివసించేవారని.. తన తండ్రి 2002లో మృతిచెందాడని ఆమె పేర్కొంది. తన తల్లి అబిడ్స్ జీహెచ్ఎంసీ యూసీడీ విభాగంలో అటెండర్‌గా పని చేసిందని తెలిపింది.
తన తల్లితో గోల్నాక న్యూ అంబేడ్కర్ నగర్‌కు చెందిన తెరాస నాయకుడు పసుల అంజనేయులు(ఆయిల్ అంజయ్య) వివాహేతర సంబంధం కొనసాగించాడని పేర్కొంది. తన తల్లికి కల్లు తాగడం అలవాటు చేసి అంజయ్య తమ ఇంటికి సంబంధించిన ఆస్తిని.. తన కుమారుడు చంద్రశేఖర్ పేరుమీద అక్రమంగా రాయించుకున్నాడని ఆమె వెల్లడించింది.
తన తల్లి ఈ ఏడాది జూన్ 30న రిటైర్ అయ్యిందని తెలిపింది. భర్తను తానే అంటూ అంజయ్య తన తండ్రి సంతకాన్ని ఫోర్జరీ చేసి.. తన తల్లి రిటైర్మెంట్ డబ్బులు 40 లక్షలు కాజేశాడని మహిళ ఆరోపించింది. గత నెల ఆగస్టు 26న తన తల్లి మరణించిందని.. తల్లి మరణించిన విషయాన్ని తమకు చెప్పకుండా అంత్యక్రియలు చేయాలని ప్రయత్నించాడని ఆమె చెప్పింది. స్థానికుల ద్వారా తల్లి మరణించినట్లు తెలిసి తాను అక్కడికి వెళితే అంజయ్య అతని కుమారులు తనపై దాడి చేసి కొట్టారని వాపోయింది.
తన తల్లి ఆస్తి, డబ్బులు కాజేయడమే కాకుండా.. అంజయ్య తనను తన తల్లి ఇంటి నుంచి వెళ్లగొట్టడానికి తనపై అంబర్‌పేట పోలీస్ స్టేషన్లో అక్రమ కేసులు పెట్టించారని ఆమె ఆరోపించింది. అంబర్‌పేట పోలీసులు తన ఫిర్యాదు తీసుకోవడం లేదని ఆమె వివరించింది. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పందించి తనకు న్యాయం చేయాలని మహిళ విజ్ఞప్తి చేసింది.
ఇదీ చూడండి : పెళ్లైన 20 రోజులకే... భర్తను చంపేసింది