Roads damaged: రాష్ట్రంలో భారీవర్షాలకు గోదావరి వరద తోడవడం రవాణా వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసింది. వాగులు ఉప్పొంగడంతో ప్రధాన రహదారులు, గ్రామాల రోడ్లు కోతకు గురయ్యాయి. రహదారులన్నీ ఇంకా బురద, చిత్తడితో ఉండటంతో ప్రజలు ఎటూ ప్రయాణించేందుకు వీల్లేని పరిస్థితి. ఆస్పత్రులు, ఇతర అవసరాలకు వెళ్లేందుకు పరిస్థితులు అనుకూలంగా లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. వరద ప్రభావిత జిల్లాల్లో పలు మండల కేంద్రాలు, గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్ల నష్టాలపై అధికారులు అంచనా వేస్తున్నారు. కొన్నిచోట్ల ఇంకా వర్షాలు పడుతుండటంతో తాత్కాలిక మరమ్మతులకూ ఆటంకాలు ఏర్పడుతున్నాయి.
ఎక్కడికక్కడ ధ్వంసం: వరదలతో ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, ఖమ్మం, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పంచాయతీ, ఆర్‌అండ్‌బీ రోడ్లు దెబ్బతిన్నాయి. ఆసిఫాబాద్ జిల్లాలో 32 రోడ్లు ధ్వంసమయ్యాయి. ప్రధాన మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వరద ఇప్పుడిప్పుడే తగ్గుతుండడంతో నష్టాల అంచనాలు కొనసాగుతున్నాయి.
నిర్మల్ జిల్లాలో పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీకి చెందిన 65 రోడ్లు దెబ్బతిన్నాయి. ఇందులో పంచాయతీరాజ్ రోడ్లు 48 వరకు ఉండగా, మరమ్మతులకు దాదాపు రూ.20 కోట్లు అవసరమని ఆ శాఖ అంచనా వేస్తోంది. భూపాలపల్లి జిల్లాలో 28 రోడ్లు ధ్వంసమయ్యాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పంచాయతీరాజ్ రోడ్లు 271 కి.మీ, ఆర్‌అండ్‌బీ 59 కి.మీ. మేర దెబ్బతిన్నాయి. నిజామాబాద్ ప్రాంతంలోనే 11 ఆర్‌అండ్‌బీ, 16 పంచాయతీ రోడ్లు కోతకు గురయ్యాయి. వీటి తాత్కాలిక మరమ్మతులకు రూ.4 కోట్లతో అంచనా వేస్తున్నారు.
కాగజ్‌నగర్ నుంచి దెహగామ్ వెళ్లే రహదారి బీబ్రా వద్ద పెద్దవాగు ఉప్పొంగడంతో దాదాపు 100 మీటర్ల వరకు కొట్టుకుపోయింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఆటోలు బీబ్రా వద్దకు వచ్చి ఆగిపోతున్నాయి. దెహగామ్ నుంచి కాగజ్‌నగర్ వెళ్లేవారు ఈ 100 మీటర్లు బురదలో కాలినడకన ప్రయాణించి... బీబ్రా నుంచి మరో ఆటోలో కాగజ్‌నగర్ ప్రయాణిస్తున్నారు. ఈ మార్గంలో కనీసం ద్విచక్ర వాహనాలు కూడా వెళ్లే పరిస్థితి లేదు. వాహనాల్లో వెళ్లాలంటే బెల్లంపల్లి మీదుగా దాదాపు 30 కి.మీ. అదనంగా ప్రయాణించాల్సి వస్తోంది.
ఆసిఫాబాద్ - తిర్యానీ మార్గంలో బుగ్గగూడ వద్ద వరదలతో రోడ్డు తెగిపోయింది. దీంతో తిర్యానీ మండల గ్రామాలకు రవాణా నిలిచిపోయి.. తాండూరు మీదుగా 15 కి.మీ. అదనంగా ప్రయాణించాల్సి వస్తోంది. కెరమెరి మండలం కూర్పేటగూడ వద్ద చిన్నవాగు పొంగడంతో పంచాయతీరోడ్డు కల్వర్టు ధ్వంసమైంది. దెహగామ్‌లో కేసరిగుంట రోడ్డు కొట్టుకుపోయింది.
నిర్మల్ జిల్లాలో కడెం ప్రాజెక్టు వరద ఉప్పొంగడంతో పాండవాపూర్ వంతెన కోతకు గురైంది. దీంతో నిర్మల్ - మంచిర్యాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు పొలాల మీదుగా నడిచి వెళ్తున్నారు. ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు కడెం ఎడమకాలువ గట్టు మీదుగా కడెం ప్రాజెక్టు పైనుంచి వెళ్తున్నాయి. పెద్ద వాహనాలు నిర్మల్ వెళ్లేందుకు దాదాపు 70 కి.మీ. అదనంగా ప్రయాణించాల్సి వస్తోంది.
భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలోని కాటారం-మేడారం ప్రధాన రహదారి కేశవాపూర్ వద్ద రోడ్డు తెగిపోయింది. మేడారం, భద్రాచలం, రాజమండ్రి వెళ్లేందుకు ఇది మహారాష్ట్ర, ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ ప్రాంతాల వారికి దగ్గరి రహదారి.
ఇవీ చదవండి: Student Suicide: ఆరో తరగతి విద్యార్థిని సూసైడ్.. సీసీ కెమెరాల్లో దృశ్యాలు