Main culprits in the TSPSC paper leakage: పరిచయంతో మొదలైన స్నేహం.. డబ్బు ఆశ జూపి, లేని ఆలోచన కలిగించి పకడ్బందీగా నిర్వహించే పరీక్షా పేపర్‌ను లీక్ చేయించింది. కలకలం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ పరీక్షా పేపర్ లీక్ వ్యవహారంలో పోలీసులు 9 మందిని అరెస్ట్ చేయగా ప్రధాన నిందితుడు, కార్యదర్శి పీఎగా ఉన్న ప్రవీణ్ అతని స్నేహితురాలు చూపిన డబ్బుకు ఆశపడి టీఎస్‌పీఎస్సీ పేపర్‌ను లీక్ చేసినట్లు పోలీసులు తేల్చారు. ఏపీలోని రాజమహేంద్రవరానికి చెందిన పులిదిండి ప్రవీణ్‌కుమార్‌ను ప్రధాన నిందితునిగా గుర్తించారు.
TSPSC paper leakage latest update : బీటెక్ పూర్తి చేసిన ప్రవీణ్ తండ్రి హరిచంద్రరావు ప్రభుత్వ ముద్రణాలయంలో అదనపు ఎస్పీగా పనిచేశారు. విధి నిర్వహణలో మరణించటంతో కారుణ్య నియామకం కింద ప్రవీణ్ అక్కడే జూనియర్ అసిస్టెంట్‌గా చేరాడు. 2017 నుంచి టీఎస్పీఎస్సీలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. మహబూబ్‌నగర్ జిల్లా పగిడ్యాల్ పంచగల్ తండాకు చెందిన ఎల్.రేణుక గురుకుల ఉపాధ్యాయ పరీక్షకు దరఖాస్తు చేయగా తప్పులు దొర్లటంతో సరిచేసుకునేందుకు టీఎస్‌పీఎస్సీ కార్యాలయానికి వెళ్లారు.
అక్కడ ప్రవీణ్‌తో పరిచయమై అతడి ఫోన్ నంబర్ తీసుకొని తరచూ మాట్లాడుతుండేది. ప్రస్తుతం వనపర్తి గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న రేణుకా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఆమె తన సోదరుడు కె.రాజేశ్వర్ నాయక్ కోసం ప్రశ్నపత్రాలను కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. వికారాబాద్ జిల్లా రెవెన్యూ శాఖలో టెక్నికల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఆమె భర్త ఢాక్యానాయక్‌తో కలిసి ప్రవీణ్‌తో సంప్రదింపులు జరిపింది. ఇదే కార్యాలయంలో నెట్‌వర్క్ అడ్మిన్‌గా పనిచేస్తున్న రాజశేఖర్‌రెడ్డితో కలసి ప్రశ్నపత్రాలు కొట్టేసేందుకు పథకం వేశారు.
కమిషన్ కార్యదర్శి వ్యక్తిగత సహాయకుడిగా పనిచేస్తున్న ప్రవీణ్‌కుమార్.. కార్యదర్శి డైరీలోని ఐపీ అడ్రస్‌ను దొంగచాటుగా సేకరించాడు. రాజశేఖర్‌రెడ్డితో కలసి కార్యాలయ ఇన్‌ఛార్జి కంప్యూటర్ నుంచి వివిధ విభాగాల ప్రశ్నపత్రాలున్న ఫోల్డర్‌ను ప్రవీణ్ 4 పెన్‌డ్రైవ్‌ల్లో భద్రపరిచాడు. కార్యాలయంలోనే పదుల సంఖ్యలో కాపీలు తీసుకున్నాడు. అసిస్టెంట్ ఇంజినీర్ ప్రశ్నపత్రాలను అక్కడే ప్రింట్ తీసుకున్నారు. వాటిని ఈ నెల 2న రేణుక, ఢాక్యానాయక్‌లకు ఇచ్చి 5 లక్షలు తీసుకున్నాడు. రేణుక, ఢాక్యానాయక్, రాజేశ్వర్ నాయక్‌లను ప్రవీణ్ బడంగ్‌పేట్‌లోని తన నివాసానికి తీసుకెళ్లి రెండ్రోజులపాటు అక్కడే ఉంచాడు.
ఈ నెల 5న రాజేశ్వర్‌ను తన వాహనంపైనే పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లి ఉదయం, సాయంత్రం రెండు పేపర్లు రాయించి తీసుకొచ్చాడు. పరీక్ష పూర్తయ్యాక ఈ నెల 6న రేణుక దంపతులు ప్రవీణ్‌కు మరో 5 లక్షలు ఇచ్చారు. ఇవి బేస్ పేపర్లు కావటంతో ప్రశ్నలు, సమాధానాలు పక్కనే ఉంటాయి. దీన్ని సొమ్ము చేసుకునేందుకు రేణుక దంపతులు కొత్త పథకం వేశారు. మేడ్చల్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న మహబూబ్‌నగర్ జిల్లా మన్సూర్‌పల్లి తండాకు చెందిన కె.శ్రీనివాస్ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నట్లు తెలుసుకొని తమ వద్ద ప్రశ్నపత్రాలు ఉన్నట్లు సమాచారమిచ్చారు. తాను ఎస్సై ఉద్యోగానికి సిద్ధమవుతున్నానని ఈ పరీక్ష రాసేవాళ్లు వేరే ఉన్నారంటూ మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన నీలేష్‌నాయక్, పి.గోపాల్‌నాయక్‌ల వివరాలిచ్చాడు.
అతడిచ్చిన సమాచారంతో ఆ ఇద్దరికీ 13.50 లక్షలకు ఏఈ సివిల్ ప్రశ్నపత్రాలు విక్రయించారు. ప్రశ్నపత్రాలు లీకైనట్లు గుర్తించిన టీఎస్‌పీఎస్సీ అధికారులు బేగంబజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని వెనక ప్రవీణ్ ప్రమేయం ఉండొచ్చనే అనుమానం వ్యక్తంచేశారు. సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్, బేగంబజార్ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టి కంప్యూటర్ల నుంచి ప్రశ్నపత్రాలు చోరీ చేసినట్లు తేల్చారు. ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్‌లను అదుపులోకి తీసుకొని ప్రశ్నించటంతో విషయం వెలుగుచూసింది.
లీకేజీతో ప్రమేయం ఉన్న ప్రవీణ్‌కుమార్, రాజశేఖర్, రేణుక, ఢాక్యానాయక్, కె.రాజేశ్వర్‌నాయక్, కె.నీలేష్‌నాయక్, పి.గోపాల్‌నాయక్, కె.శ్రీనివాస్, కె.రాజేంద్రనాయక్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల్లో ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులుండటం గమనార్హం. ప్రవీణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించినపుడు నోరుమెదపలేదని తెలిసింది. ప్రశ్నపత్రాలు ఏ విధంగా బయటకు తీశామో రాజశేఖర్‌రెడ్డి వెల్లడించినట్లు తెలుస్తోంది.
ఇవీ చదవండి: