జాతీయోద్యమం గురించి ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు మహాత్మగాంధీ దేశమంతా పర్యటించారు. ఆ పర్యటనల్లో భాగంగా ఆరు సార్లు బెజవాడకు వచ్చారు. గాంధీజీ పర్యటనల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది మూడోది. ఆ పర్యటనలోనే సహాయ నిరాకణోద్యమంలో భాగస్వాములు కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆ పిలుపుతో ఎంతో మంది... బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన సత్కారాలు, బిరుదులు, ఉన్నతోద్యాగాలు వదులుకున్నారు. అప్పుడే.. అయ్యదేవర కాళేశ్వరరావు... తనకు ఇచ్చిన దేశోద్ధారక బిరుదును తిరస్కరించారు. ఆ తర్వాత ఆయన ఆంధ్రరప్రదేశ్ మొదటి స్పీకర్ అయ్యారు.
1921లో వారం పాటు బస
1921లో వారం రోజులపాటు మహాత్ముడు విజయవాడలో బస చేశారు. ఆల్ ఇండియా వర్కింగ్ కమిటీ సమావేశం నిర్వహించింది కూడా ఆ సమయంలోనే. ప్రస్తుత బందరు రోడ్డులోని బాపు మ్యూజియంలో ఆ సమావేశం జరిగింది. అప్పుడే పింగళి వెంకయ్య... దేశం కోసం రూపొందించిన మువ్వన్నెల పతాకాన్ని గాంధీజీకి అందించారు. దాన్ని ఆయన ఆమోదించారు. ఆ సమావేశానికి దేశవ్యాప్తంగా ఉన్న నేతలంతా వచ్చారు.
1929లో ఖద్దరు యాత్ర కోసం...
1929లో ఖద్దరు యాత్రలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చేందుకు బాపూ బెజవాడకు వచ్చారు. స్వదేశీ వస్త్రాలనే ధరించాలి... వాటిని మనమే రూపొందించాలంటూ సాగిన ఆ యాత్రకు విశేష స్పందన వచ్చింది. 1937లో గంటూరు జిల్లాలో పెను ఉప్పెన వచ్చింది. అప్పుడు బాధితులను పరామర్శించేందుకు గాంధీజీ బెజవాడ వచ్చారు. చివరిగా 1946వ సంవత్సరం జనవరి 26న హిందీ ప్రచారయాత్రలో భాగంగా విజయవాడకు వచ్చారు. మహాత్ముడు బెజవాడకు వస్తున్నారని తెలిసి... లక్షల సంఖ్యలో జనం రైల్వేస్టేషన్‌కు తరలివెళ్లారు. ఆ రోజు బాపూజీ మౌనవ్రతంలో ఉండడం వల్ల కేవలం అభివాదం చేసి వెళ్లిపోయారు.
రైల్వే స్టేషన్ సమీపంలోని కొండకు గాంధీ హిల్ పేరు
మహాత్మాగాంధీకి బెజవాడతో ఉన్న అనుబంధాన్ని తరతరాలు గుర్తించుకునే విధంగా రైల్వేస్టేషన్ సమీపంలోని కొండకు గాంధీ హిల్ అని అప్పటి రాష్ట్రపతి జకిర్ హుస్సేన్ నామకరణం చేశారు. ఆ గాంధీ హిల్ ఇప్పటికి కూడా చారిత్రక, పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది. ఆల్ ఇండియా వర్కింగ్ కమిటీ సమావేశం గుర్తుగా... పింగళి వెంకయ్య... గాంధీకి మువ్వన్నెల పతకాన్ని ఇచ్చిన సన్నివేశాన్ని కళ్లకుకట్టేలా ప్రస్తుత బాపు మ్యూజియంలో పాలరాతి శిల్పాలు ఏర్పాటు చేశారు.