కరోనా కట్టడిలో భాగంగా మార్చిలో ఉన్నపళంగా లాక్‌డౌన్ విధించారు. లాక్‌డౌన్ పుణ్యమా అని దేశవ్యాప్తంగా ఎంతో మంది వలస కార్మికులు ఉన్నచోట పనులు లేక, చేతిలో డబ్బు లేక ఆందోళన చెందుతున్నారు. సొంతూర్లకు వెళ్లడానికి రవాణా సౌకర్యం కల్పించమని ఆ రాష్ట్ర ప్రభుత్వాలను శరణువేడుకుంటున్నారు.
సర్కారు సాయంతో..
లాక్‌డౌన్ కారణంగా మహారాష్ట్రలో పనికి వెళ్లిన తెలుగు రాష్ట్రాల ప్రజలు పనుల్లేక దుర్భర పరిస్థితులు అనుభవిస్తున్నారు. తమను ఇంటికి పంపాలని ఆ రాష్ట్ర సర్కారును కోరగా.. ప్రభుత్వం బస్ ఏర్పాటు చేసింది. సుమారు 200 మందికి పైగా కార్మికులు బస్లో సొంతూరుకు పయనమయ్యారు. కానీ వారి ఆనందం ఎక్కువ సేపు ఉండలేదు.
ఏవీ దొరకని చోట..
మహారాష్ట్ర రవాణా... కార్మికులను తమ స్వస్థలాలకు తీసుకెళ్లకుండా కర్ణాటక బసవకల్యాణ్లోని చందకపుర జాతీయ రహదారిపై వీరిని వదిలేసింది. ఊహించని ఘటనకు తెలుగు రాష్ట్రాల కార్మికులు కుదేలయ్యారు. వారిలో గర్భిణీలు, చిన్నపిల్లలు, వృద్ధులు ఉన్నారని.. కనీసం నీరు, ఆహారం కూడా దొరకని ప్రాంతంలో తమను వదిలేశారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేసేదేమీలేక కాలిబాటన స్వగ్రామాలకు బయలుదేరారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు స్పందించి తమకు తగిన ఏర్పాట్లు చేయాలని వారు కోరుతున్నారు.
మేం మహారాష్ట్ర నుంచి వస్తున్నాం. లాక్‌డౌన్ వల్ల 50 రోజుల నుంచి మేం ఇబ్బందులు పడుతున్నాము. అక్కడి ప్రభుత్వ సహకారంతో బస్సులో మమ్మల్ని తీసుకొచ్చారు కానీ కర్ణాటక బోర్డర్ వద్ద వదిలేశారు. ఇక్కడ ఆహారం, నీరు ఏమీ దొరకక పిల్లలు, గర్భిణులు ఇబ్బంది పడుతున్నారు. మేము ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాకు వెళ్లాలి. అధికారులు స్పందించి మమ్మల్ని మా స్వస్థలాలకు చేర్చండి. - బాధిత వలస కార్మికులు
ఇదీ చదవండిః డ్రైవర్ లేని బస్సు..అలా దూసుకెళ్లింది..