లాక్‌డౌన్ నేపథ్యంలో వంటగ్యాస్ సిలిండర్ల బుకింగ్ భారీగా పెరిగినట్లు చమురు సంస్థల రాష్ట్రస్థాయి సమన్వయకర్త రాజేశ్ తెలిపారు. సరిపడినన్ని వంటగ్యాస్ నిల్వలు ఉన్నాయని... సరఫరా ఆగిపోతుందన్న ఆందోళన వినియోగదారులు చెందొద్దని ఆయనొక ప్రకటనలో స్పష్టం చేశారు. వంట గ్యాస్, పెట్రోల్ ఉత్పత్తులు కూడా అత్యవసర సర్వీసుల్లో ఉన్నాయని... ప్రస్తుత పరిస్థితుల్లో చమురు సంస్థల మార్కెటింగ్‌కి ఎలాంటి ఇబ్బందులు లేవని వివరించారు. లాక్‌డౌన్ ప్రభావం ఏమీ లేకుండానే ఎల్పీజీ ప్లాంట్లు సాధారణంగానే పనిచేస్తున్నాయని, సరిపడినన్ని నిల్వలు ఉన్నందున భయపడి సిలిండర్లు ఉండగానే తిరిగి బుకింగ్ చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ నెల ఒకటో తేదీ సాయంత్రానికి డెలివరీ కాకుండా పెండింగ్‌లో 5 లక్షల 89వేల 709 సిలిండర్లు ఉండగా... కొత్తగా ఈ నెల రెండో తేదీన మరో లక్షా 48వేల 790 బుకింగ్ అయినట్లు ఆయన వివరించారు.
రెండో తేదీ నాటికి 7లక్షల 38వేల 499 సిలిండర్లు డెలివరీ చేయాల్సి ఉండగా....లక్షా 87వేల 919 సిలిండర్లు వినియోగదారులకు చేరవేసినట్లు పేర్కొన్నారు. గురువారం సాయంత్రానికి డెలివరీ కాకుండా 5 లక్షల 50వేల 942 సిలిండర్లు పెండింగ్ ఉన్నట్లు ఆయన వివరించారు. గతంలో సిలిండర్ బుకింగ్ చేసిన 24 గంటల్లో డెలివరీ సిలిండర్ బుకింగ్ అయ్యేదని...ఇప్పుడు మూడు రోజులు పడుతోందని ఆయన తెలిపారు. లాక్‌డౌన్ సందర్భంగా అవసరం లేకపోయినా బుకింగ్‌లు చేస్తున్నందునే ఆలస్యం అవుతోందని వివరించారు. నగదు చెల్లింపులు బదులు ఆన్‌లైన్ చెల్లింపులు చేయవచ్చన్నారు. లాక్‌డౌన్ కాలంలో సజావుగా సరఫరా చేస్తామని ప్రకటించారు.
ఇవీ చూడండి: ర్యాపిడ్ టెస్టింగ్ కిట్‌తో ఇంటివద్దే కరోనా పరీక్షలు