Adani US Indictment : సౌరశక్తి సరఫరా ఒప్పందాలు పొందేందుకు భారత ప్రభుత్వ అధికారులకు అదానీ గ్రూపు లంచాలు ఇచ్చరని అమెరికా చేసిన ఆరోపణలపై తాజాగా అదానీ గ్రీన్‌ఎనర్జీ సంస్థ స్పందించింది. ఈ కేసుకు సంబంధించి గౌతమ్ అదానీ, ఆయన బంధువు సాగర్‌లపై లంచం అభియోగాలు నమోదైనట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని వెల్లడించింది. స్టాక్ ఎక్స్ఛేంజీ ఫైలింగ్ సందర్భంగా అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఈ మేరకు స్పందించింది.
'అమెరికా ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ (FCPA) కింద గౌతమ్ అదానీ, ఆయన బంధువు సాగర్, కంపెనీ సీనియర్ డైరెక్టర్ వినీత్ జైన్‌పై లంచం, అవినీతి అభియోగాలు నమోదైనట్లు కథనాలు వచ్చాయి. వాటిని మేం తిరస్కరిస్తున్నాం. అవన్నీ అవాస్తవం. వీరంతా సెక్యూరిటీస్ సంబంధించిన మోసం ఆరోపణలను మాత్రమే ఎదుర్కొంటున్నారు. అంతే తప్ప వారిపై లంచం, అవినీతి అభియోగాలు ఏవీ నమోదు కాలేదు. ఎఫ్‌సీపీఏ నిబంధనలు ఉల్లంఘించారని అమెరికా న్యాయశాఖ నమోదు చేసిన కేసులో ఈ ముగ్గురు పేర్ల ప్రస్తావన లేదు' అని అదానీ గ్రీన్ పేర్కొంది.
అదానీ, సాగర్ అదానీతో పాటు ఆరుగురు 2020-24 మధ్య కాలంలో భారత ప్రభుత్వ అధికారులకు 265 మిలియన్ డాలర్ల ( భారతీయ కరెన్సీలో రూ.2,200 కోట్ల) లంచాలు ఇచ్చేందుకు అంగీకరించారని న్యూయార్క్ కోర్టులో వారిపై నేరారోపణ నమోదైంది. లాభదాయకమైన సౌర విద్యుత్ సరఫరా ఒప్పందాలను పొందేందుకు ఈ లంచాలు ఇచ్చారనేది అభియోగం. అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్‌లు గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, అజూర్ పవర్ గ్లోబల్ ఎగ్జిక్యూటివ్ సిరిల్ కాబనేస్‌లపై యూఎస్ ఎస్‌ఈసీ అభియోగాలు మోపింది. ఈక్రమంలోనే ఇటీవల గౌతమ్, సాగర్‌కు యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (యూఎస్ ఎస్‌ఈసీ) సమన్లు జారీ చేసినట్లు వార్తలు వచ్చాయి. కాగా, ఈ ఆరోపణలను అదానీ గ్రూప్ ఖండించింది. దీనిపై న్యాయపరంగా ముందుకువెళ్తామని పేర్కొంది. అయితే ఈ విషయంపై పార్లమెంట్ సమావేశాల్లో చర్చించాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.