కూతురు ప్రేమపెళ్లి చేసుకోవడాన్ని సహించలేక అల్లుడు ఇంటి పై దాడికి దిగిన ఘటన ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా నందిగామలో చోటు చేసుకుంది. నందిగామకు చెందిన రాయపాటి సుస్మిత (22), తోటకూర వెంకటేశ్లు ఒకే కాలేజీలో చదువుకున్నారు. ఆ సమయంలో వారి మద్య ప్రేమ చిగురించడంతో, పెళ్లి విషయమై వారిరువురు తల్లిదండ్రులను సంప్రదించారు. అబ్బాయి తరఫు తల్లిదండ్రులు పెళ్లికి అంగీకరించగా, సుస్మిత తల్లిదండ్రులు కులాంతర వివాహానికి ససేమిరా అన్నారు. అయినా.. ప్రేమికులు పెళ్లి చేసుకోవడం.. అమ్మాయి తండ్రి తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయాడు. అర్ధరాత్రి అబ్బాయి ఇంటికి చేరుకుని, కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో వెంకటేష్ కుటుంబీకులకు స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం ఇరువురు తల్లిదండ్రులు నందిగామ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.
ఇవీ చూడండి: భార్యాభర్తల మధ్య మనస్పర్థలు.. ఆత్మహత్యకు యత్నించిన భార్య