చికెన్‌కు కొవిడ్ - 19కు సంబంధం లేదని ఇప్పటికే కేంద్రం కొన్ని రోజుల క్రితం స్పష్టం చేసింది. కొవిడ్ వైరస్ వ్యాప్తి చికెన్ ద్వారా జరుగుతున్నట్లు ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి సమాచారం లేదని పశుసంవర్థక శాఖ కమిషనర్ ప్రవీణ్ మలిక్ స్పష్టం చేశారు.
అసత్య ప్రచారాలు నమ్మొద్దు
మన దగ్గర చికెన్‍తో పాటు ఇతర వంటలన్నీ 100 డిగ్రీల పైన ఉడికించి తింటాం కాబట్టి ఎట్టిపరిస్థితుల్లో కొవిడ్‌పై భయపడాల్సిన అవసరం లేదని ఫౌల్ట్రీ నిపుణులు చెబుతున్నారు. పుకార్లను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రజలు కూడా వాటిని నమ్మొద్దని కోరుతున్నారు.
పడిపోయిన వినియోగం
పోషకాహారం అందించే చికెన్ వినియోగం తగ్గిపోయిందని ఫౌల్ట్రీ రంగ ప్రతినిధులు వెల్లడించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.500 కోట్ల మేర నష్టపోయినట్లు తెలిపారు. డిమాండ్ లేకపోవటం వల్ల గత పది రోజుల నుంచి ఫామ్ గేట్ ధర దేశవ్యాప్తంగా కిలో రూ.70 నుంచి రూ.40లకు పడిపోయిందని పేర్కొన్నారు. కోళ్ల పరిశ్రమ మీద ఆధారపడ్డ వాళ్లు ప్రస్తుతం ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
హైదరాబాద్‌లో...
భాగ్యనగరంలో సగం వరకు అమ్మకాలు పడిపోయాయని పలు చికెన్ సెంటర్ల యజమానులు వాపోతున్నారు. సాధారణంగా ఈ సమయంలో స్కిన్ లెస్ ధర కిలోకు రూ.200 వద్ద ఉండేదని, ఇప్పుడు మాత్రం రూ. 150వద్ద ఉందని తెలిపారు. హోల్ సెల్ దుకాణాల్లో దీని ధర రూ. 100గా ఉన్నట్లు వెల్లడించారు. చికెన్ గురించి అపోహలను పోగొట్టేందుకు, సామాజిక మాధ్యమాల్లో వీటి ప్రచారాన్ని నిరోధించేందుకు ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
ఇదీ చూడండి: కేసీఆర్ కటౌట్... మంత్రి తలసానికి జరిమానా