హైదరాబాద్ నగరంలో గడిచిన రెండు రోజులుగా లాక్‌డౌన్ కఠినంగా అమలవుతోంది. పోలీసు ఉన్నతాధికారులే రహదారులపై నిల్చొని నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై చర్యలు తీసుకుంటున్నారు. నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో శనివారం భారీ ఎత్తున వాహనాలను సీజ్ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేయడంతో పాటు వాహనాలను సైతం స్వాధీనం చేసుకుంటుండటంతో నగరవాసుల్లో భయం పుట్టుకొచ్చింది. దీంతో అనవసరంగా వాహనాలతో రోడ్లపైకి రావడం దాదాపు ఆగిపోయింది.
తనిఖీ కేంద్రాల్లోనూ ప్రతి వాహనాన్ని నిలిపి వివరాలు సేకరిస్తుండటంతో అవసరంలేని వారు బయటకు రావడానికి జంకుతున్నారు. దీంతో హైదరాబాద్ నగర రహదారులన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి. ఆదివారం రాత్రి ఎర్రగడ్డ, ఎస్‌ఆర్‌నగర్, అమీర్‌పేట, పంజాగుట్ట, హైటెక్ సిటీ, కొండాపూర్, జెఎన్‌టీయూ రోడ్డు, కేపీహెచ్‌బీ రహదారి, కూకట్‌పల్లి రహదారులు, వై జంక్షన్ తదితర ప్రాంతాల్లోని రహదారులు బోసిపోయాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, మాదాపూర్ తదితర ప్రాంతాల్లోను రహదారులన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. లాక్‌డౌన్ మొదలైనప్పటి నుంచీ దుకాణాలు మూసివేసినా కూడా మూడో వంతు వాహనాలు రహదారులపై కనిపించేవి. పోలీసులు నిబంధనలు కఠినతరం చేయడంతో పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చాయి.
ఇదీ చదవండి: బయటపడుతున్న లక్షణాలు... చిన్నారులకు ఎంఐఎస్ ముప్పు!