జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతంలోని ఇంజినీరింగ్ విడిభాగాల పరిశ్రమలో 16 మంది కార్మికులు పనిచేస్తున్నారు. తాజా లాక్‌డౌన్ అమల్లోకి వచ్చినప్పట్నుంచి కార్మికుల రాకపోకలకు, అవసరమైన ముడిసరకు తరలింపునకు ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో యాజమాన్యం పరిశ్రమను మూసివేసింది. లాక్‌డౌన్ తర్వాత తెరుస్తామని.. ఈ సమయంలో ‘నో వర్క్ నో పే’ అమలు చేయనున్నట్లు కార్మికులకు తెలిపింది.
రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 8వేల పరిశ్రమలు కొనసాగుతున్నాయి. 23 పారిశ్రామికవాడలున్నాయి. జీడిమెట్ల, కాటేదాన్, గాంధీనగర్, నాచారం, మల్లాపూర్, చర్లపల్లి, బాలానగర్ పారిశ్రామికవాడల్లో పనిచేసే కార్మికులు రాకపోకలకు తీవ్రఇబ్బందులు పడుతున్నారు. కార్మికులు చాలామంది నిత్యం ఆటోలు, బస్సుల్లో పారిశ్రామికవాడలకు చేరుకునేవారు. ఉదయం పదిలోపు పరిశ్రమలకు చేరుకున్నా, విధులు ముగించుకున్న తర్వాత ఇంటికి వెళ్లేందుకు ఇబ్బందిపడుతున్నారు. సొంత వాహనాలు ఉన్నవారే విధులకు హాజరవుతున్నారు. దీంతో కొన్ని పరిశ్రమల నిర్వాహకులు యూనిట్లను తాత్కాలికంగా మూసివేస్తున్నారు.
‘‘ప్రస్తుతం రవాణా సౌకర్యం లేకపోవడంతో కార్మికులు రావడానికి ఇబ్బంది అవుతోంది. ఉద్యోగులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు కంపెనీ తరఫున వాహనాలు పంపించి రవాణా సౌకర్యం కల్పిస్తున్నాం.’’ అని సువెన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ డీజీఎం నిర్మల్ బాబు వివరించారు.
వేధిస్తున్న ఆక్సిజన్ కొరత
ఇనుము, ఉక్కు, రసాయన, రిఫైనరీలు, వెల్డింగ్, విద్యుద్దీకరణ పరిశ్రమలకు ఆక్సిజన్ అవసరం. ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత కారణంగా పరిశ్రమలకు సరఫరాను ప్రభుత్వం నిలిపివేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పరిశ్రమలు నడవడం కష్టంగా మారింది. మరోవైపు లాక్‌డౌన్‌తో మరింత ఇబ్బందుల్లో కూరుకుపోతున్న పరిస్థితి. ఫార్మా తదితర కంపెనీలకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఔషధ ఆధారిత కంపెనీలు సొంతంగా ప్రయాణ సదుపాయాలు సమకూర్చి కార్మికులను పరిశ్రమలకు రప్పిస్తున్నాయి. జీడిమెట్ల పారిశ్రామికవాడలో సుమారు 2వేల పరిశ్రమలు ఉన్నాయి. ఫార్మా కంపెనీలు మినహాయించి.. ఇంజినీరింగ్, స్టీల్, కటింగ్, వెల్డింగ్, మరమ్మతులు, యంత్రాల విడిభాగాలు తయారీ యూనిట్లు చాలావరకు మూసివేసి కనిపిస్తున్నాయి.
సిబ్బందిని తగ్గించుకుంటున్నాయి
గతేడాది లాక్‌డౌన్ నుంచి పరిశ్రమలకు ఇబ్బందికరంగా ఉంది. కొన్ని పరిశ్రమలు సిబ్బందిని తగ్గించుకుంటున్నట్లు మా దృష్టికి వచ్చింది. వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్లి రాకపోవడంతో పరిశ్రమల నిర్వహణ ఇబ్బందికరంగా మారింది. నిర్వాహకులు ముడిసరకులు, ఇతరత్రా ఏవైనా సమస్యలుంటే చెబితే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తాం.
-నజీర్ అహ్మద్, ఐలా కమిషనర్, బాలానగర్
తాత్కాలికంగా మూసివేశా
జీడిమెట్ల పారిశ్రామికలోని ఎస్వీ కో-ఆపరేటివ్ సొసైటీలో పది మంది కార్మికులతో చిన్న కంపెనీ నిర్వహిస్తున్నా. వ్యవసాయ ఉత్పత్తుల తయారీ, మరమ్మతులు చేస్తాం. గతే లాక్‌డౌన్ నుంచే ఇంకా తేరుకోలేదు. రెండో విడత లాక్‌డౌన్ 10 రోజులు కంపెనీ మూసేయాలని నిర్ణయించా. కార్మికులు ఇబ్బంది పడకుండా పూర్తి వేతనం ప్రకటించాను. నాలా ఎంతో మంది మూసివేస్తున్నారు. సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలను ప్రభుత్వం ఆదుకోవాలి.
-హరి, జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతం
ఇదీ చూడండి: ఇక గోదాముల్లోనే ఈ-మార్కెట్!