లాక్డౌన్ విధించి నెల రోజులవుతోంది. కరోనా వైరస్ కట్టడి చేయడానికి ప్రజలను బయటకు రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. అత్యవసరం ఉన్న వాళ్లు మాత్రమే రహదారులపైకి రావాలని స్పష్టం చేశారు. అయినప్పటికీ కొంతమంది యథేచ్చగా బయట తిరుగుతున్నారు. కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండటంతో ప్రభుత్వం మే 7 వరకు లాక్డౌన్ పొడిగించింది.
ఒకే దారిలో రాకపోకలు
మరింత కట్టుదిట్టంగా వ్యవహరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో పోలీసులు పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. కాలనీలు, బస్తీల సంక్షేమ సంఘాల నేతలతో మాట్లాడి వాళ్లకు పలు సూచనలు చేశారు. తమ కాలనీలకు వెళ్లడానికి రెండు మూడు దారులుంటే.. వాటన్నింటిని పూర్తిగా మూసేసి.. ఒకే దారిలో రాకపోకలు సాగిస్తున్నారు.
గల్లీలపై పోలీసుల దృష్టి
కాలనీలకు చెందిన నాయకులు, యువకులు ప్రధాన ప్రవేశద్వారం వద్ద పర్యవేక్షణ చేస్తున్నారు. కాలనీల నుంచి ప్రధాన రహదారులను కలిసే చోట పోలీసులు బారికేడ్లు వేశారు. వచ్చిపోయే వాహనాల కోసం ఒకవైపు తెరిచి ఉంచారు. ఇప్పటి వరకు ప్రధాన రహదారులపైనే తనిఖీలు నిర్వహించిన ఖాకీలు.. గల్లీలపైనా దృష్టి పెట్టారు.
427 కేసులు
అకారణంగా బయటికి వచ్చే వాహనదారులపై చలాన్లు విధిస్తున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని చాలా కాలనీల్లో ఎవరికి వాళ్లు స్వచ్ఛందంగా బారికేడ్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో నిన్న రాత్రి వరకు 427 కేసులు నమోదయ్యాయి. అందులో 57 మంది కోలుకోగా... 21 మంది మృతి చెందారు. ప్రస్తుతం 344 మంది చికిత్స పొందుతున్నారు.
అత్యధికంగా అసిఫ్‌నగర్ ఠాణా పరిధిలో
అత్యధికంగా అసిఫ్‌నగర్ ఠాణా పరిధిలో 49 కేసులు, భవానీనగర్‌లో 39, రెయిన్‌బజార్‌లో 23, కాలాపత్తర్‌లో 20, గోల్కొండ ఠాణా పరిధిలో 19 కేసులున్నాయి. కరోనా సోకిన వ్యక్తి ఉన్న ప్రాంతాన్ని పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు కలిసి ఇప్పటికే నియంత్రణ ప్రాంతంగా గుర్తించి.. అక్కడ పూర్తిగా నిర్బంధం విధించారు. ఆ ప్రాంతం నుంచి ఇతరులెవర్నీ బయటికి రానివ్వడం లేదు. బయటి వాళ్లనెవర్నీ... లోపటికి వెళ్లనివ్వడం లేదు.
పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు 24 గంటల పాటు.. నియంత్రణ ప్రాంతాలను పర్యవేక్షిస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో సుమారు 160 నియంత్రణ ప్రాంతాలున్నాయి. కరోనా కేసులు అదుపులోకి రాకపోవటంతో... హైదరాబాద్‌లోని ఇతర ప్రాంతాలను కాలనీల సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో ఆంక్షలు విధిస్తున్నారు.
ఇవీ చూడండి: పరదాలు కుట్టే పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం