రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి అమలులోకి వచ్చిన లాక్‌డౌన్ ప్రభావం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖపై తీవ్రంగా పడింది. కరోనా కేసులు పెరగడం, మృతుల సంఖ్య అధికం కావడంతో ఇప్పటికే రోజువారీ రిజిస్ట్రేషన్లు సగానికి పడిపోయాయి. రిజిస్ట్రేషన్ల శాఖలోను కరోనా కేసుల తీవ్రతతో ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్లడానికి భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి లాక్‌డౌన్ అమల్లోకి రావడంతో.. కార్యకలాపాలు ఆపేయాలని ఆ శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ 10 రోజులు రిజిస్ట్రేషన్లు ఉండవని స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఎటువంటి రిజిస్ట్రేషన్లు ఉండవని, ఎవరైనా ఇప్పటికే ఆన్‌లైన్ ద్వారా స్లాట్ బుక్ చేసుకుని ఉంటే.. తిరిగి మరో తేదీకి రీషెడ్యూల్ చేస్తామని అధికారులు తెలిపారు. ఈ నెల 21 వరకు రిజిస్ట్రేషన్లు ఉండవని, ఎవరూ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు రావద్దని సూచించారు.
ప్రభుత్వానికి ఆదాయాన్ని తెచ్చిపెట్టే శాఖల్లో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఒకటి. అయినప్పటికీ క్రయవిక్రయాలన్నీ కూడా ప్రజలతో ముడిపడి ఉంటాయి. లాక్ డౌన్ కారణంగా రాకపోకలు ఉండనందున… ప్రభుత్వం కూడా మూసివేతకే మొగ్గు చూపింది.
ఇదీ చదవండి: రాష్ట్రంలో నేటి నుంచి 10రోజులు లాక్‌డౌన్