తెలంగాణ (Telangana)లో మందుబాబులు రెచ్చిపోయి మద్యం సేవిస్తున్నారు. సర్కార్ ఖజానాకు పెద్ద మొత్తంలో డబ్బు జమ చేస్తున్నారు. కరోనా కష్టకాలంలోనూ మద్యం విక్రయాలు (Liquor Sales) ఏ మాత్రం తగ్గకపోగా పెరిగాయి. అంటే మందుబాబు ఏ విధంగా తాగుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఒక్క జులై నెలలోనే రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయని అధికారులు చెబుతున్నారు.
జులైనెలలో రికార్డు...
జులై నెలలో రూ.2,767.73 కోట్ల విలువైన 34 లక్షల కేసుల లిక్కర్, 27.16 లక్షల కేసుల బీరు అమ్ముడు పోయిందని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఈ ఆర్థిక ఏడాదిలో ఇంత పెద్ద మొత్తంలో మద్యం అమ్మకాలు జరగడం ఇదే ప్రప్రథమం అని చెప్పొచ్చు. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో రూ.643 కోట్ల విలువైన మద్యం, అత్యల్పంగా మేడ్చల్ జిల్లాలో రూ.63 కోట్ల విలువైన అమ్మకాలు జరిగినట్లు అబ్కారీ శాఖ స్పష్టం చేసింది.
జిల్లాలవారీగా...
ఉమ్మడి జిల్లా | మద్యం విక్రయాలు |
రంగారెడ్డి | రూ.643 కోట్లు |
హైదరాబాద్ | రూ.308 కోట్లు |
నల్గొండ | రూ.288.91 కోట్లు |
వరంగల్ | రూ.230.53 కోట్లు |
మెదక్ | రూ.212.17 కోట్లు |
మహబూబ్‌నగర్ | రూ.196.73 కోట్లు |
కరీంనగర్ | రూ.196 కోట్లు |
ఆదిలాబాద్ | రూ.142.87 కోట్లు |
నిజామాబాద్ | రూ.134.92 కోట్లు |
ఉమ్మడి జిల్లాల వారీగా జరిగిన విక్రయాలను పరిశీలించినట్లయితే నిజామాబాద్ రూ.134.92 కోట్లు, ఆదిలాబాద్ జిల్లాలో రూ.142.87 కోట్లు, కరీంనగర్ రూ.196 కోట్లు, మహబూబ్‌నగర్ రూ.196.73 కోట్లు, మెదక్ రూ.212.17 కోట్లు, వరంగల్ రూ.230.53 కోట్లు, నల్గొండ రూ. 288.91 కోట్లు, హైదరాబాద్ రూ.308 కోట్ల లెక్కన మద్యం అమ్మకాలు జరిగినట్లు అబ్కారీ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
మద్యం విక్రయాల్లో... ఉత్పత్తి, విక్రయదారులకు కలిపి 40 శాతం పోగా మిగిలిన 60 శాతం వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీ కింద రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు చేరుతుంది. జులై నెలలో జరిగిన మద్యం విక్రయాలపై ప్రభుత్వానికి రూ. 1,600 కోట్లకుపైగా ఆదాయం సమకూరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
బీరు ధర తగ్గించిన ప్రభుత్వం...
తెలంగాణలో బీరు సీసాపై పది రూపాయలు తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. విక్రయాలు భారీగా పడిపోవడం వల్ల సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. ఆ తరువాత అమ్మకాలు జోరందుకున్నాయి. అందుకు తాజాగా వెలువడిన గణాంకాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. గతంలో బీరు సీసాపై ప్రత్యేక ఎక్సైజ్ సెస్ పేరుతో 30 రూపాయలు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం విధించింది.
ఇదీ చూడండి: Beer Price Reduce: మద్యం ప్రియులకు తీపి కబురు... తగ్గిన బీరు ధర