Legislative Assembly approves TSRTC Employees Merger Bill : ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. గవర్నర్ తమిళిసై అనుమతి ఇవ్వడంతో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం బిల్లును ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని మంత్రివర్గం నిర్ణయించిందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు. ఆర్టీసీ కార్యకలాపాలు ఎప్పటిలాగానే కొనసాగుతాయన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల విలీనం వల్ల ప్రభుత్వంపై ఏటా 3 వేల కోట్లు భారం పడనుందని వివరించారు.
Puvvada Ajay Kumar on TSRTC Bill : ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే పీఆర్‌సీ ఆర్టీసీ ఉద్యోగులకూ వర్తిస్తుందని పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు. ఆర్టీసీ కార్పొరేషన్, దాని ఆస్తులు యథాతథంగా కొనసాగుతాయని పేర్కొన్నారు. కార్మికుల బకాయిలను కూడా చెల్లిస్తున్నామన్నారు. ఉద్యోగులతో చర్చించి పదవీ విరమణ ప్రయోజనాలు నిర్ణయిస్తామని వ్యాఖ్యానించారు. ఆర్టీసీలో ప్రస్తుతం 43 వేల 55 మంది ఉద్యోగులు ఉన్నట్లు పువ్వాడ అజయ్‌కుమార్ సభకు తెలిపారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కార్పొరేషన్ రూల్స్ ప్రకారం కొనసాగుతారని స్పష్టతనిచ్చారు.
Bajireddy Govardhan on Legislative Assembly approves TSRTC Bill : సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి రుణపడి ఉంటామని ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ తెలిపారు. సంస్థను ప్రైవేటుపరం చేస్తామని దుష్ప్రచారం చేశారన్న బాజిరెడ్డి.. ఆర్టీసీ ఆస్తులు అమ్ముతున్నారని కూడా దుష్ప్రచారం చేశారన్నారు. ఆర్టీసీని నష్టాల్లోంచి గట్టెక్కించేందుకు ఎంతో కృషి చేశామని పేర్కొన్నారు. ఆర్టీసీకి ఏటా రూ.1250 కోట్లు నష్టం వస్తోందని వెల్లడించారు. ఆర్టీసీ ఉద్యోగుల జీవితాల్లో వెలుగునింపుతున్న సీఎంకు ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్ ధన్యవాదాలు తెలిపారు. చర్చ అనంతరం ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. పురపాలక చట్ట సవరణ బిల్లు, పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లుకూ అసెంబ్లీ ఆమోద ముద్ర వేసింది.
Governor Approves TSRTC Bill : ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం
గవర్నర్‌కు ధన్యవాదాలు.. ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్‌సీ ఇస్తాం : ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ తెలిసీ తెలియక వివాదం చేశారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆర్టీసీ పెట్టిందే ప్రజారవాణా ఉండాలని.. కాలక్రమంలో ఆ సంస్థ నష్టాల్లో కూరుకుపోయిందన్నారు. ఆర్టీసీ ఆస్తులపై కన్నేశామని కొంతమంది విమర్శిస్తున్నారన్న కేసీఆర్.. అది పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేశారు. ప్రభుత్వ పరంగా ఆర్టీసీని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. బస్ స్టేషన్లను ఆధునికీకరిస్తామన్న ఆయన.. అవసరమైతే మరి కొంత భూమి సేకరిస్తామన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్‌సీ ఇస్తామని స్పష్టం చేశారు. గవర్నర్ గారు పనిలేని పని పెట్టుకొని 96 క్లారిఫికేసన్లు అడిగారన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. చివరికి గవర్నర్‌గారికి జ్ఞానోదయమై ఆర్టీసీ బిల్లు ఓకే చేసి పంపించారన్నారు. ఆర్టీసీ కార్మికుల పక్షాన, తన పక్షాన సీఎం కేసీఆర్ గవర్నర్ గారికి ధన్యవాదాలు తెలిపారు.
'నేను కూడా రవాణాశాఖ మంత్రిగా పనిచేశా. ఆరోజుల్లో ఆర్టీసీ రూ.14కోట్ల నష్టాల్లో ఉండేది. ఆ నష్టాన్ని పూడ్చి.. వివిధ ప్రక్రియల ద్వారా మరో రూ.14 కోట్ల ఆదాయం తెచ్చాం. డీజిల్ ధర పెరగటం ఆర్టీసీకి పెను భారంగా మారింది. ఆర్టీసీలో రోజుకు 6లక్షల లీటర్ల డీజిల్ వినియోగిస్తారు. ఆర్టీసీ పరిస్థితిపై కేబినెట్‌లో 5 గంటలు చర్చించాం. చివరికి ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలోకి తీసుకోవాలని అనుకున్నాం. ఏ పని చేసినా ప్రభుత్వానికి ఒక బాధ్యత ఉటుంది. యువ ఐఏఎస్ ఆఫీసర్లను నియమించి ఆర్టీసీని గాడిలో పెడతాం. ఉద్యోగ భద్రత వస్తుందని వారు కూడా సంతోష పడుతున్నారు.'-సీఎం కేసీఆర్