Left-wing students unions protest: ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాల్లో విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఫెయిల్ కావడానికి, పలువురు ఆత్మహత్యకు పాల్పడటానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని విద్యార్థి సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం, ఇంటర్మీడియట్ బోర్డు అధికారుల వైఫల్యం కారణంగా ఫలితాల్లో గందరగోళం తలెత్తిందని విద్యార్థి నాయకులు విమర్శించారు. హైదరాబాద్ కోంపల్లి జాతీయ రహదారిపై ఏబీవీపీ విద్యార్థి నాయకులు ఆందోళన చేపట్టారు.
విద్యా శాఖమంత్రిని తొలగించాలి...
ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నారాయణగూడ చౌరస్తా నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్డు వరకు వామపక్ష విద్యార్థి సంఘాలు ర్యాలీ నిర్వహించాయి. విద్యార్థుల జీవితాలతో ఇంటర్ బోర్డు చెలగాటం ఆడుతోందని నాయకులు విమర్శించారు. ఇంటర్ బోర్డును ప్రక్షాళన చేసి బోర్డు కార్యదర్శిని తొలిగించాలని విద్యార్థి నేతలు కోరారు. ఇంటర్ విద్యార్థుల మరణాలపై స్పందించని విద్యా శాఖమంత్రిని తొలగించాలని డిమాండ్ చేశారు. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామన్న మనస్తాపంతో ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని కోరారు. ఉచితంగా పరీక్ష పత్రాల రీవాల్యుయేషన్ జరిపించాలన్నారు.
ఇంటర్ బోర్డు ముట్టడికి యత్నం...
ఇంటర్ బోర్డు కార్యాలయం ముట్టడికి ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు యత్నించింది. రోడ్డుపై బైఠాయించి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థుల ఆత్మహత్యలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు.. వెంటనే పరీక్షలు రాసే అవకాశం కల్పించాలని కోరారు. కార్యాలయం లోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌ను అరెస్ట్ చేశారు. దీంతో ఇంటర్ బోర్డు వద్ద ఉద్రిక్తత నెలకొంది.
'విద్యార్థుల జీవితాలతో ఇంటర్ బోర్డు చెలగాటం ఆడుతోంది. ప్రభుత్వ నిర్లక్ష్యం, ఇంటర్మీడియట్ బోర్డు అధికారుల వైఫల్యం వల్లే ఫలితాల్లో గందరగోళం తలెత్తింది. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామన్న మనస్తాపంతో ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలి. వెంటనే ఇంటర్ బోర్డును ప్రక్షాళన చేసి బోర్డు కార్యదర్శిని తొలిగించాలి. ఇంటర్ విద్యార్థుల మరణాలపై ఇప్పటివరకు స్పందించని విద్యా శాఖమంత్రిని వెంటనే తొలగించాలి.'- విద్యార్థి నేతలు
ఇదీ చదవండి: TRS Protest Over Paddy Procurement: కేంద్రం తీరుపై భగ్గుమన్న తెరాస.. ఊరూరా చావు డప్పులతో ఆందోళనలు