కొవిడ్ వల్ల లెర్నింగ్ లైసెన్సు (ఎల్‌ఎల్‌ఆర్) తీసుకోవాలనుకునే వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. దాదాపు 15-20 రోజులు దాటుతున్నా స్లాట్‌లు దొరకడం లేదు. డ్రైవింగ్ లైసెన్సుల విషయంలో ఇదే పరిస్థితి నెలకొంది. కొవిడ్ నేపథ్యంలో అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో సేవలపై నియంత్రణ పెట్టిన సంగతి తెలిసిందే. అధిక సంఖ్యలో ప్రజలు కార్యాలయాల లోపలకు రావడం వల్ల వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యలకు ఉపక్రమించారు. దీంతో ఆర్టీఏ సేవల పొందేందుకు అవసరమయ్యే స్లాట్‌లకు డిమాండ్ ఏర్పడింది. ఈ అవకాశాన్ని కొందరు దళారులు సొమ్ము చేసుకుంటున్నారు. తమకు ఫీజుతోపాటు అదనంగా కొంత ముట్టజెప్పితే ఎల్‌ఎల్‌ఆర్, డీఎల్ ఇతర అన్ని రకాలు త్వరితగతిన చేసి పెడతామని నమ్మబలుకుతున్నారు. కొందరు దళారులు లోపల ఉన్న ఆర్టీఏ సిబ్బందితో ఒక అవగాహనకు వచ్చి ఈ దందా నడిపిస్తున్నట్లు తెలుస్తోంది.
కొవిడ్‌కు ముందు దళారులు కార్యాలయాల లోపలే తిష్ఠ వేసేవారు. దీంతో ఎవరు నిజమైన వాహనదారుడు? ఎవరు దళారీ? అనేది గుర్తించడం కష్టంగా ఉండేది. కరోనా తర్వాత ప్రస్తుతం స్లాట్ పొందిన వారిని తప్ఫ. ఇతరులను కార్యాలయాల లోపలకు అనుమతించడం లేదు. దీంతో రోడ్లపైనే దందా కొనసాగిస్తున్నారు. అధికారులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నా వారి వైఖరిలో మార్పు రావడం లేదు. ఖైరతాబాద్, సికింద్రాబాద్, మలక్‌పేట, ఉప్పల్, అత్తాపూర్, మెహిదీపట్నం, నాగోలు, కొండాపూర్ ఆర్టీఏ కార్యాలయాల వద్ద రోడ్లు అన్ని ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు దళారులు, వాహనదారులతో రద్దీగా మారుతున్నాయి.
స్లాట్‌లు తగ్గించడంతో..
కొవిడ్‌కు ముందు ప్రతి కార్యాలయంలో 150-200 వరకు స్లాట్ బుకింగ్‌లకు అనుమతించేవారు. అన్నిరకాల సేవలకు తొలుత ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకొని ఆ సమయానికి వస్తే సరిపోయేది. కొవిడ్ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పరిమిత సంఖ్యలో స్లాట్‌లకు అవకాశం కల్పిస్తున్నారు. గతంలో గంటలో పది వరకు స్లాట్‌లు ఉండేవి. ప్రస్తుతం వాటిని సగానికి తగ్గించారు. దీంతో ఒక్కసారిగా స్లాట్‌లకు డిమాండ్ ఏర్పడింది.
కొవిడ్ వల్ల కళాశాలలు, స్కూళ్లు తెరుచుకోలేదు. చాలామంది ఇంటి నుంచే పనిచేస్తున్నారు. వైరస్‌కు భయపడి చాలామంది ప్రజారవాణాకు దూరంగా ఉంటారు. తప్పనిసరైతే తప్ప ఆటోలను, క్యాబ్‌లను ఆశ్రయించడం లేదు. ఈ తరుణంలో వ్యక్తిగత వాహనాల్లో వెళ్లేందుకే చాలామంది మొగ్గు చూపుతున్నారు. డ్రైవింగ్ లైసెన్సు తీసుకోవాలని భావిస్తున్నారు. అయితే స్లాట్‌లు లభించక నిరాశ చెందుతున్నారు. అధికారులు స్పందించి కరోనాను కట్టడికి చర్యలు తీసుకుంటూనే స్లాట్‌లు అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు.