KTR On Convenience Deed Distribution Program : రాబోయే ఎన్నికల్లో మళ్లీ బీఆర్‌ఎస్ ప్రభుత్వమే వస్తుందని ఐటీ మంత్రి కేటీఆర్ జోస్యం చేశారు. ఈసారి కూడా ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసి హ్యాట్రిక్ సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు వదులుకోరని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఎల్బీనగర్ హస్తినాపురం జీఎస్ఆర్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన కన్వీనియన్స్ డీడ్ పత్రాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నియోజకవర్గం పరిధిలో 118 జీవో ద్వారా లబ్ధిదారులకు కన్వీనియన్స్ డీడ్ పత్రాలను మంత్రి అందజేశారు.
32 కాలనీలకు చెందిన 4000 మందికి ప్రొసీడింగ్స్ పత్రాలను అందజేశారు. రాష్ట్రంలో ఆగస్టు 15 నుంచి అక్టోబరులోగా నియోజకవర్గానికి 4 వేల ఇళ్లు పంపిణీ చేయడం జరుగుతుందని మంత్రి ప్రకటించారు. హైదరాబాద్‌లో లక్ష రెండు పడక గదుల ఇళ్లు పంపిణికి సిద్ధంగా ఉన్నాయన్నారు. గృహ లక్ష్మి పథకం ద్వారా ఇంటి స్థలం ఉంటే రూ.3లక్షలు అందిస్తామని తెలిపారు. అలాగే తర్వలోనే ఎల్బీనగర్ - నాగోల్ మెట్రో లింకు పనులు ప్రారంభిస్తామని కేటీఆర్ ప్రకటించారు.
మెుత్తం 314 కి.మీ. మెట్రో మార్గం అందుబాటులోకి తీసుకొస్తున్నామని మంత్రి తెలిపారు. ఆర్ఆర్ఆర్ చుట్టూ 159 కి.మీ. మెట్రో రూట్ ఏర్పాటు చేస్తామన్నారు. భూసేకరణ, తక్కువ ఖర్చుతో ఇది ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. హస్నాపూర్ నుంచి పెద్దఅంబర్‌పేట్ వరకు మెట్రో నిర్మాణం చేపడతామన్నారు. 'నాడు తెలంగాణ సాధిస్తామని కేసీఆర్ బయలుదేరితే ఎవరూ నమ్మలేదు.. అలాగే ఇప్పుడు కూడా నమ్మడం లేదు.. కానీ చేసి చూపిస్తాం' అని కేటీఆర్ స్పష్టం చేశారు.
KTR criticism of Congress : తెలంగాణ సాధించడమే కాకుండా తలసరి ఆదాయంలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెట్టిన ఘనత కేసీఆరేదని కొనియాడారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, కమిషనర్ రోనాల్డ్ రాస్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లు, పలువురు ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
KTR On VXI Company launch : అంతకు ముందు మాదాపూర్‌లోని వీఎక్స్‌ఐ సంస్థ సరికొత్త ఆఫీసును కేటీఆర్ ప్రారంభించారు. ఈ మేరకు సంస్థ ఉద్యోగులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. హైదరాబాద్ నగరం ఐటీ సంస్థల అభివృద్ధిలో ఎంతో సహాయ పడుతుందన్నారు. ప్రస్తుతం ఎన్నో సంస్థలు కొలువు తీరిన నగరంలో వీఎక్స్‌ఐ కూడా ఆ జాబితాలో చేరి తమ ఉనికిని చాటుకుంటున్నందుకు ఆనందంగా ఉందన్నారు. వచ్చే మూడేళ్లలో వీఎక్స్‌ఐ అనుకున్న ఫలితాలు సాధించేందుకు ప్రభుత్వం సహాయ సహకారాలు ఉంటాయన్నారు. గ్లోబల్ సంస్థలుగా ఉంటూ ప్రాంతీయ ప్రమాణాలను అనుసరించే ప్రతి సంస్థకు ప్రభుత్వం మద్దతు ఉంటుందని కేటీఆర్ పునరుద్ఘాటించారు.
ఇవీ చదవండి:
- KTR Instructions to BRS Leaders : 'మెట్రో విస్తరణ నియోజక వర్గాల్లో సంబరాలు నిర్వహించాలి'
- Hyderabad Metro expantion : ఓఆర్ఆర్ చుట్టూ మెట్రో విస్తరణ.. కొత్త కారిడార్లు ఇవే: ఎన్వీఎస్ రెడ్డి
- Governor Tamilisai on pending bills : 'బిల్లులను తిప్పి పంపడం నా ఉద్దేశం కాదు.. ఎందుకు తిరస్కరించానో కారణాలు చెప్పాను'