గోదావరికి వరద పోటెత్తడం వల్ల ఏపీ పశ్చిమగోదావరి జిల్లాలో పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి వరద ప్రవాహం మధ్యాహ్నం మూడు గంటలకు 53 అడుగులకు చేరుకొంది. ఈ ఆరేళ్ల కాలంలో మొదటిసారిగా రికార్డు స్థాయిలో గోదావరి నీటి మట్టం నమోదైంది. గోదావరికి వరద పోటెత్తడంతో ముంపు గ్రామాల రహదారులపైకి భారీగా వరదనీరు చేరింది. పోలవరం వద్ద నిర్మించిన కాఫర్ డ్యాం ప్రభావం మరింత కనిపించింది. పోలవరం వద్ద ఎగువ కాఫర్ డ్యాం వద్ద నీరుపైకి ఎగదన్నడంతో ముంపు గ్రామాల్లో చుట్టూ నీరు చేరుతోంది.
గత ఏడాది ఉగ్రరూపం దాల్చిన గోదావరి... ఈ ఏడాది ముంపు గ్రామాల ప్రజలను వణికిస్తోంది. పదుల సంఖ్యలో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వేల ఎకరాల్లో పంట నీట మునిగింది. లంక గ్రామాల్లోకి భారీగా వరద నీరు చేరింది. పలు లంక గ్రామాలకు సైతం రాకపోకలు నిలిచిపోయాయి. నాటు పడవల ద్వారా ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో పలు గ్రామాలు రెండు రోజులుగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వేలేరుపాడు మండలం రేపాకుగొమ్మ, తాటకూరుగొమ్మ, తిరుమలాపురం, నార్లవరం, కటుకూరు, కోయిదా గ్రామాలు తీవ్రస్థాయిలో వరద తాకిడికి గురయ్యాయి.
29 గ్రామాల్లోని పదివేల మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోలవరం మండలంలోని కొండ్రుకోట, తాటగుంట, కొరటూరు పంచాయతీల్లోని 19 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తెప్పల ద్వారా ప్రజలు ప్రయాణం సాగిస్తున్నారు. యలమంచలి మండలం కనకాయలంక, యలమంచలిలంక, దొడ్డిపట్ల లంకగ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఆచంట మండలంలోని ఆయోధ్యలంకతోపాటు.. మూడు గ్రామాలను వరదనీరు చుట్టుముట్టింది. వేలేరుపాడు, కక్కునూరు, పోలవరం మండలాల్లో సుమారు వేయి ఎకరాల వరకు పత్తిచేలు నీటమునిగాయి. లంకగ్రామాల్లో కూరగాయలు, ఇతర ఉద్యానపంటలు నీటమునిగాయి. ప్రధానంగా తమలపాకు తోటలు నీటమునగడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.
ఆయా గ్రామాల్లో వైద్యసిబ్బందిని నియమించి.. వైద్యశిబిరాలు ఏర్పాటు చేశారు. రెవెన్యూ సిబ్బంది గ్రామాల్లో ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కొవిడ్-19 నేపథ్యంలో ఆయా గ్రామాలకు పడవలు ఏర్పాటు చేయలేదు. పడవల్లో ప్రయాణం చేయడం వల్ల.. కరోనా విజృంభించే ఆస్కారం ఉందని.. పడవలను ఏర్పాటు చేయలేదని అధికారులు అంటున్నారు. ముంపు గ్రామాల పరిస్థితిని సమీక్షించేందుకు ఏలూరు కలెక్టరేట్, కుక్కునూరు, పోలవరం ఆర్డీఓ కార్యాలయాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. ముంపు గ్రామాల ప్రజలకు సహాయం అందించేందుకు ఎన్డీఆర్ఎఫ్ దళాలు సిద్ధం చేశారు. పోలవరం ప్రాజెక్టు వద్ద స్పిల్ వే పైనుంచి నీరు ప్రవహిస్తోంది. పోలవరం వద్ద గోదావరి గట్టు బలహీనంగా మారింది. దీన్ని పటిష్టం చేసేందుకు అధికారులు ప్రయత్నాలు సాగిస్తున్నారు.
ఇదీ చూడండి : భారీ వర్షం... ఉమ్మడి వరంగల్ జిల్లా అతలాకుతలం