"మా భూమికి ఇప్పటికే రిజిస్ట్రేషన్ పూర్తయింది. పాత యజమాని పేరు నుంచి మారలేదు. ఇంతలో ఆయన వేరేవాళ్లకు రిజిస్ట్రేషన్ చేస్తున్నారని తెలిసింది. దయచేసి ఆ ప్రక్రియను నిలిపివేయండి’ అంటూ యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు ఇన్‌ఛార్జి తహసీల్దారుకు ఇటీవల బాధితుల ఫిర్యాదు."
"మా పాసుపుస్తకంలో 27 గుంటలు తొలగించి వేరే వారికి కలిపారు. ధరణిలో వారి పేరుపైకి ఆ విస్తీర్ణం చేరిపోయింది. దీన్ని సరిచేయకపోతే భవిష్యత్తులో మాకు నష్టం వాటిల్లితుంది’ అంటూ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల తహసీల్దారుకు ఓ బాధితుడి ఫిర్యాదు."
Dharani Problems : ధరణి పోర్టల్లో భూమి వివరాలు, చేతిలో పాసుపుస్తకం ఉంటే చాలు రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ పూర్తవుతుండటాన్ని ఆసరాగా తీసుకుని కొందరు అక్రమ రిజిస్ట్రేషన్లకు తెగిస్తున్నారు. బాధితులు గుర్తించి అడ్డుకుంటే సరి. లేదంటే మరొక వ్యక్తి పేరుపైకి ఆ భూమి వెళ్లే పరిస్థితులు ఉన్నాయి. దీంతో న్యాయ వివాదాలు పెరిగే అవకాశాలు లేకపోలేదు.
గతేడాది నవంబరు రెండో తేదీ నుంచి ధరణిలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు ఏక కాలంలో పూర్తవుతున్నాయి. అంతకు ముందు రిజిస్ట్రేషన్లు అన్నీ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా పూర్తి చేసేవారు. దీనికి కార్డ్ సాంకేతిక వ్యవస్థను ఉపయోగించేవారు. మ్యుటేషన్లు మాత్రం రెవెన్యూశాఖ చేసేది. ధరణి రాకతో కార్డ్ స్థానంలో టీఎస్‌ఐఎల్‌ఆర్‌ఎంఎస్ సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. దీంతో సాగు భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు ధరణిలో చేస్తున్నారు. అంతకుముందు కార్డ్ సాంకేతికతతో పూర్తయిన రిజిస్ట్రేషన్లకు సంబంధించిన భూముల మ్యుటేషన్లు భారీగా నిలిచిపోయాయి. ఇప్పటికే 1.75 లక్షల పెండింగ్ మ్యుటేషన్లకు ప్రభుత్వానికి దరఖాస్తులు వచ్చాయి. జిల్లా కలెక్టర్లు వాటిని పూర్తి చేస్తున్నారు. మరోవైపు ఈ ప్రక్రియ కొనసాగుతుండగానే పాత యజమానులు కొందరు ధరణిలో విక్రయానికి పెడుతున్న సంఘటనలు తెరపైకి వస్తున్నాయి. రాష్ట్రంలో నిషేధిత భూముల జాబితాలో(22 ఏ)(పీఓబీ) చేర్చిన పట్టా భూములకు స్పష్టత ఎప్పుడు వస్తుందనేది ఇదమిత్థంగా తెలియడం లేదు. ఆ భూముల సమస్యను పరిష్కరించాలని సీఎస్ ఆదేశించినప్పటికీ వేగం పుంజుకోవడం లేదు. మరోవైపు భూ యజమానులకూ ఆ సమస్య పరిష్కారం అయిందా? లేదా? అనే సమచారం రావడం లేదు. కొందరి సమస్య పరిష్కారం అయినా జవాబేదీ అందలేదని చెబుతున్నారు. ఈ క్రమంలో కొందరి భూములు పీఓబీ నుంచి బయటపడిన మరుక్షణమే మ్యుటేషన్లు పూర్తికాని భూములను పాత యజమానులు గుట్టుగా స్లాట్లు నమోదు చేసి వేరేవారికి రిజిస్ట్రేషన్లు చేస్తున్న సంఘటనలున్నాయి. ఈ నేపథ్యంలో పీఓబీ పరిష్కారం కాగానే సమాచారం ఇవ్వాలని భూ యజమానులు కలెక్టర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చూడండి: Dharani problems: తుదిదశకు ధరణి సమస్యల పరిష్కార కసరత్తు.. సీఎంకు ఉపసంఘం నివేదిక..