చారిత్రక ప్రసిద్ధి గాంచిన హైదరాబాద్ పాతబస్తీలోని లాల్‌దర్వాజ బోనాల పండుగ ఘనంగా ప్రారంభమయింది. శ్రీ సింహవాహిణి మహంకాళీ దేవాలయంలో ఉదయం 5 గంటలకు ప్రారంభమైన ఉత్సవాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా.. భక్తులు లేకుండా వేడుకలు జరుగుతున్నాయి. ఆలయ కమిటీ వారే ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.
అవి ఎప్పటిలాగే..
బోనాల పాటలు.. పోతురాజుల విన్యాసాలు లేకుండానే బోనాలను ముగించనున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. ఎప్పటిలాగే యథావిధిగా అమ్మవారి రంగం.. భవిష్యవాణికి ఏర్పాట్లు చేశామన్నారు. జంట నగరాల్లో జరిగే బోనాలు వేడుకలను ప్రజలు తమ ఇళ్లల్లోనే జరుపుకోవాలని.. కరోనా కట్టడికి సహకరించాలని అధికారులు సూచించారు.
ట్రాఫిక్ ఆంక్షలు..
బోనాల దృష్ట్యా దక్షిణ మండలం ఇంఛార్జ్ డీసీపీ గజరావు భూపాల్.. మహంకాళీ అమ్మవారి దేవాలయ కమిటీతో సమావేశం అయ్యారు. కొవిడ్ నిబంధనలను తప్పకుండా పాటించాలని స్పష్టం చేశారు. రేపు నిర్వహించే రంగం, బలిగంప, పోతరాజుల గావు కార్యక్రమాలు.. ఆలయ పరిసర ప్రాంతంలో భౌతిక దూరం పాటిస్తూ చేసుకోవాలని కోరారు. నాగుల చింత నుంచి లాల్ దర్వాజా, ఓల్డ్ ఛత్రినాక పోలీస్‌స్టేషన్ నుంచి.. లాల్‌దర్వాజ, గౌలిపురా.. లాల్‌దర్వాజా రోడ్డును మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇందుకు ప్రజలు సహకరించాలని కోరారు.