Kunamneni Sambasiva Rao Comments on BJP: బీజేపీపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శలు గుప్పించారు. మోదీ ప్రధాని అయ్యాక 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చారని మండిపడ్డారు. కేంద్రం రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ, ఫెడరల్ వ్యవస్థను దెబ్బ తీసిందని దుయ్యబట్టారు. ప్రభుత్వ రంగ సంస్థలను పూర్తిగా విధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. దేశాన్ని పాలించిన ప్రధానుల్లో అత్యంత అవినీతిపరుడు.. నరేంద్ర మోదీ అని విమర్శించారు. హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడిన ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు.
తెలంగాణను కైవసం చేసుకునేందుకు బీజేపీ కుట్రలు: బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అనేక అవినీతి ఆరోపణలు వస్తే.. ఒక్క కేసైనా పెట్టారా అని కూనంనేని సాంబశివరావు ప్రశ్నించారు. యూపీలో అవినీతి జరగడం లేదా.. సామాన్యులపైన బుల్డోజర్లు ఎక్కిస్తారా అని నిలదీశారు. తెలంగాణను కైవసం చేసుకునేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా 15 సీట్లు గెలవడమే ఎక్కువని కూనంనేని జోస్యం చెప్పారు.
ఈ క్రమంలోనే కవితను కించపరిచే విధంగా మాట్లాడినందుకు బండి సంజయ్ తక్షణమే క్షమాపణ చెప్పాలని కూనంనేని డిమాండ్ చేశారు. షర్మిలపై స్పందించిన గవర్నర్ తమిళిసై.. కవిత విషయంలో ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. మేయర్ అపాయింట్‌మెంట్ కోరితే గవర్నర్ ఎందుకు ఇవ్వలేదని అన్నారు.
బీజేపీ హఠావో.. దేశ్ కో బచావో పేరుతో: ఈ నేపథ్యంలోనే దేశాన్ని రక్షించుకునేందుకు బీజేపీ హఠావో దేశ్ కో బచావో పేరుతో.. ప్రజల వద్దకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నామని కూనంనేని సాంబశివరావు తెలిపారు. ఏప్రిల్ 14 నుంచి నెల రోజుల పాటు ఇంటింటికీ సీపీఐ కార్యక్రమం చేపట్టనున్నట్లు వివరించారు. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్రలు, బైక్ ర్యాలీలు నిర్వహిస్తామని వివరించారు. ఉమ్మడి పది జిల్లాలకు ఒక ముఖ్య నేత బాధ్యులుగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. 33 జిల్లాలు తిరిగేలా మరో యాత్ర చేపడతామని అన్నారు. ముగింపు సభను హైదరాబాద్‌లో నిర్వహిస్తామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం గృహ లక్ష్మి పథకం కింద ఇచ్చే సహాయాన్ని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచి ఇవ్వాలని ఆయన కోరారు.
దేశంలో ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చారు: నేడు రాజకీయాల్లోకి నేరచరిత్ర ఉన్నవారు ప్రవేశిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి ఆరోపించారు. దేశంలో ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చారని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని మార్చేలా దూరదృష్టిలో ఉన్నట్టు కనిపిస్తుందని విమర్శించారు. అందుకే ఒకే దేశం, ఒకే పన్ను, ఒకే ఎన్నిక అంటున్నారని దుయ్యబట్టారు. బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కుతుందని ఆక్షేపించారు. రాష్ట్రంలో రాజకీయాలు దిగజారి పోతున్నాయని తెలిపారు. వ్యక్తిగత ధూషణలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా బీజేపీ హఠావో దేశ్ కో బచావో నినాదంతో ప్రజల వద్దకు వెళ్తామని చాడ వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు.
సీపీఎం, సీపీఐ ముఖ్య నేతల భేటీ: సీపీఎం, సీపీఐ ముఖ్య నేతలు నేడు భేటీ కానున్నారు. సాయంత్రం 5 గంటలకు సీపీఎం రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్‌లో.. ఇరు పార్టీల రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావుతో పాటు ముఖ్య నేతలు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, ఎన్నికల్లో పొత్తులు, పోటీ చేసే సీట్లు.. దేశ వ్యాప్తంగా చేపట్టే పాదయాత్రలపై సమావేశంలో చర్చించనున్నారు.
"మోదీ ప్రధాని అయ్యాక 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చారు. తెలంగాణను కైవసం చేసుకునేందుకు బీజేపీ కుట్రలు చేస్తోంది. కేంద్రం రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ, ఫెడరల్ వ్యవస్థను దెబ్బ తీసింది. రాష్ట్రంలో బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా 15 సీట్లు గెలవడమే ఎక్కువ." - కూనంనేని సాంబశివరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
ఇవీ చదవండి: బండి వ్యాఖ్యలపై భగ్గుమన్న బీఆర్‌ఎస్.. విచారణకు సిద్ధమన్న సంజయ్
కేసీఆర్ పాలనపై కిషన్రెడ్డి ట్వీట్.. బీజేపీ సన్నాసులకు అర్థం కాదంటూ కేటీఆర్ కౌంటర్
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. NFCలో ఉద్యోగాలు.. వేలల్లో వేతనాలు..