Insta Shield Medical Device: నిజామాబాద్ జిల్లా నవీపేటకు చెందిన గ్రామీణ శాస్త్రవేత్త మండాజి నర్సింహాచారి రూపొందించిన 'ఇన్స్టాషీల్డ్ వైరస్ కిల్లర్'(Insta shield Virus Killer) పరికరాన్ని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్.. హైదరాబాద్లోని తన నివాసంలో ఆవిష్కరించారు. పరికరం రూపకల్పన, పనితీరును నర్సింహాచారిని అడిగి తెలుసుకున్న మంత్రి.. ఆయనను అభినందించారు. ఆవిష్కరణ అద్భుతమని.. ఈ పరికరం అందరికీ ఉపయోగపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. పరికరం ఉత్పత్తికి సంబంధించి పరిశ్రమ ఏర్పాటుకోసం ప్రభుత్వపరంగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. గతంలో నర్సింహాచారి 'ఇంటింటా ఇన్నోవేటర్' పురస్కారానికి ఎంపికయ్యారని.. ఇప్పుడు ఈ స్థాయికి చేరడం ఆనందంగా ఉందని మంత్రి కొనియాడారు.
ప్రజలను వైరస్ల బారి నుంచి కాపాడేందుకు.. రెండేళ్లు శ్రమించి ఇన్స్టాషీల్డ్ పరికరాన్ని రూపొందించానని నర్సింహాచారి తెలిపారు. కరోనా, సార్స్, ఒమిక్రాన్, డెల్టా తదితర అన్ని రకాల వైరస్లను.. నెగిటివ్ ఎలక్ట్రాన్ల సహాయంతో ఈ పరికరం సంహరిస్తుందన్నారు. సీసీఎంబీ, సీడీఎస్సీవో, వింటా, ఎంటాక్ ల్యాబ్ తదితర సంస్థలు దీనిని ధ్రువీకరించాయని.. ఇన్స్టాషీల్డ్ మెడికల్ డివైస్ పేరిట విడుదల చేస్తున్నారని చారి వివరించారు.
అత్యల్ప సమయంలోనే ఇది అన్ని రకాల వైరస్లను సంహరిస్తుందని చారి తెలిపారు. ఈ పరికరం వల్ల దుష్పరిణామాలు ఉండవని సీసీఎంబీ తేల్చిందని వివరణ ఇచ్చారు. ఈ గ్రామీణ శాస్త్రవేత్త ప్రస్తుతం హైదరాబాద్ రాజేంద్రనగర్ సమీప బుద్వేల్లో నివసిస్తున్నారు. కరోనా మూలాల్ని తెలుసుకుని, పలు ప్రయోగాలు చేసి ఈ పరికరం తయారు చేశారు.
ఇవీ చదవండి: MLC Kavitha On Cancer Awareness: అది ఒక అలవాటుగా చేసుకుందాం: కవిత