శాసనమండలిలో మంత్రి కేటీఆర్ హైదరాబాద్‌లో కురుస్తున్న వర్షాలపై మాట్లాడారు. ఆకాశం చిల్లులు పడుతుందా అన్నట్లుగా హైదరాబాద్‌లో వర్షాలు పడుతున్నాయని అన్నారు. సీఎం కేసీఆర్ నిన్నటి నుంచి పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. అన్ని విభాగాలు, ఎన్డీఆర్ఎఫ్ దళాలను అప్రమత్తం చేశామన్నారు.
హెలికాప్టర్లను కూడా సిద్ధం చేశామని.. ఇవాళ, రేపు సెలవు ప్రకటించామని వెల్లడించారు. ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 40 క్యాంపులు ఏర్పాటు చేశామని.. ముంపునకు గురైన ప్రాంతాల వారిని తరలిస్తున్నామని చెప్పారు. అన్నపూర్ణ కేంద్రాల ద్వారా మధ్యాహ్నం, రాత్రికి 80 వేల భోజనాలు సిద్ధం చేస్తున్నామన్నారు.
గోడ కూలి కొంత మంది చనిపోవడం బాధాకరమని.. నిర్మాణంలో ఉన్న భవనాలు, సెల్లార్లను పరిశీలిస్తున్నామని వెల్లడించారు. శిథిలావస్థకు చేరిన భవనాల నుంచి ప్రజలను తరలిస్తున్నామని చెప్పారు. సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను నోడల్ అధికారులుగా నియమించామని తెలిపారు. మూసీ, హుస్సేన్ సాగర్ పరివాహక ప్రాంతాల్లో పూర్తి అప్రమత్తంగా ఉన్నామన్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు.
ఇదీ చదవండి: లాలాపేటలో ఉద్ధృతంగా ప్రవహిస్తోన్న నాలా