KTR on TRS Plenary: తెలంగాణ ఇంటి పార్టీ తెరాస మాత్రమేనని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రజలకు అండగా ఉండేది తెరాస మాత్రమేనన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం రాజీలేకుండా పోరాడేది తెరాస మాత్రమేనని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావ వేడుకలు విజయవంతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు కేటీఆర్ పోలీసు, ట్రాఫిక్, జీహెచ్‌ఎంసీ, నగర ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ నెల 27న హెచ్ఐసీసీలో నిర్వహించే పార్టీ ఆవిర్భావ వేడుకల సందర్భంగా నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. పార్టీ పరంగా చేపట్టే కార్యక్రమాలపై నగర పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజా ప్రతినిధులతోనూ మంత్రి చర్చించారు. ఈ సమావేశంలో సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్రతోపాటు ఇతర శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు..
తెరాస ప్లీనరీపై హైదరాబాద్ ప్రజాప్రతినిధులతో భేటీ నిర్వహించామని కేటీఆర్ వెల్లడించారు. తెరాస ప్లీనరీ ఏర్పాట్లపై సలహాలు, సూచనలు స్వీకరించామన్న కేటీఆర్.. ప్లీనరీ కోసం కమిటీలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. తెరాస ప్లీనరీకి అందరికీ ఆహ్వానాలు పంపామని.. ప్రతినిధుల సభకు మాజీ మంత్రులు, ఎంపీలకు ప్రత్యేక ఆహ్వానాలు కూడా అందాయన్నారు. ఈనెల 27న ఉదయం 10 లోపు ప్లీనరీ ప్రాంతానికి చేరుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు. ఉదయం 10 గంటల నుంచి 11గంటల వరకు ప్రతినిధుల వివరాల నమోదు కార్యక్రమం ఉంటుందన్నారు.
ఉదయం 11 గంటలకుకు పార్టీ జెండాను తెరాస అధినేత కేసీఆర్ ఆవిష్కరిస్తారని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వెల్లడించారు. సాయంత్రం 5 వరకు వివిధ అంశాలపై తీర్మానాలు, చర్చలు జరుగుతాయన్నారు. ప్రతినిధుల సభకు ఆహ్వానితులు మాత్రమే రావాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించాలని ఆయన నేతలకు సూచించారు. గ్రామ పంచాయతీల్లో పార్టీ జెండాలు ఆవిష్కరించాలని అన్నారు.
ఘనంగా నిర్వహించాలి.. ఈ నెల 27వ తేదీన హెచ్ఐసీసీలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించాం. నేతలు 10 గంటల లోపే ఇక్కడికి చేరుకోవాలి. ఉ.10-ఉ.11 వరకు ప్రతినిధుల వివరాల నమోదు కార్యక్రమం ఉంటుంది. ఉదయం 11 గం.కు పార్టీ జెండాను కేసీఆర్ ఆవిష్కరిస్తారు. సాయంత్రం 5 వరకు వివిధ అంశాలపై తీర్మానాలు, చర్చలు కూలంకషంగా ఉంటాయి. ప్రతినిధుల సభకు ఆహ్వానితులు మాత్రమే రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించాలి. -కేటీఆర్, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు
మరోవైపు తెరాస ప్లీనరీ సందర్భంగా ఆ పార్టీ వివిధ కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీల్లో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులకు బాధ్యతలు అప్పగించారు. ఆహ్వాన కమిటీ, సభా ప్రాంగణం అంకరణ, ప్రతినిధుల నమోదు, వాలంటీర్ వ్యవస్థ, పార్కింగ్, ప్రతినిధుల భోజనం, తీర్మానాలు, మీడియా, తదితర కమిటీలను తెరాస ఏర్పాటు చేసింది.
ఇవీ చదవండి: