KTR on CM KCR Hattrick Win : రాష్ట్రంలో ఎన్నికల వేడి రోజురోజుకు రాజుకుంటోంది. ఇప్పటికే బీఆర్ఎస్.. ప్రచారంలో మిగతా పార్టీలకంటే ఓ అడుగు ముందే ఉంది. తాజాగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ (KTR) ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్ని.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పోటీలో లేనివారితో యుద్ధం ఏం చేస్తామని బీజేపీని ఉద్దేశించి అన్నారు. నరేంద్ర మోదీ, అమిత్ షా, భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల సీఎంలు, సామంతులు ఎందరొచ్చినా.. ఎన్ని జాకీలు పెట్టి లేపినా.. ఆ పార్టీ లేవదని వ్యాఖ్యానించారు.
ఎన్నికల్లో నూటికి నూరు శాతం తమ ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ అని కేటీఆర్ అన్నారు. ఆ పార్టీ దేశానికి, రాష్ట్రానికి చేసిన అన్యాయం, ఘోరాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నామని వివరించారు. తెలంగాణలో బలహీనంగా ఉన్న కాంగ్రెస్ కొంత పుంజుకున్నట్లు కనిపించినా.. విజయం సాధించలేదని వ్యాఖ్యానించారు. తమపై పోటీ చేస్తున్న హస్తం నేతలకు కూడా తమ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాయని కేటీఆర్ తెలిపారు.
3వ తేదీ తర్వాత తిరిగి మా ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది : కేటీఆర్
Minister KTR Fires on Congress and BJP : తాము ఎవరికీ బీ టీం కాదని.. కాంగ్రెస్, బీజేపీలకు కేసీఆర్ కొరకరాని కొయ్య అని కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ అనేక మూస ధోరణులను బద్దలు కొట్టారని. అసాధ్యమనుకున్న తెలంగాణ రాష్ట్రాన్నే సాధించారని గుర్తు చేశారు. క్రికెట్‌లో భారత్ మూడోసారి వరల్డ్‌కప్ గెలుస్తుందని. ఇక్కడ కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
ప్రజల్లో బీఆర్ఎస్‌పై స్పందన గురించి మాట్లాడుతూ.. ప్రజలను తాను జాగ్రత్తగా గమనిస్తుంటానని.. వారి హావభావాలు చూస్తే కచ్చితంగా తమ పార్టీ మంచి గెలుపు సాధిస్తుందనే నమ్మకం కలిగిందని చెప్పారు. అయితే 2-3 సార్లు ఎన్నికైన తర్వాత కొంతమందిపై ఎంతోకొంత అసంతృప్తి ఉండడమనేది అత్యంత సహజమని.. అది లేకపోతేనే అసహజమని అన్నారు. కానీ మెజార్టీ గీత దాటడానికి సరిపడా నంబరు ఇవాళ బీఆర్ఎస్‌కు కచ్చితంగా వస్తుందని కేటీఆర్ తెలిపారు.
Telangana Assembly Elections 2023 : గత తొమ్మిదిన్నరేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిందని వివరించారు. అందుకే మెజార్టీ ప్రజలు తమతో ఉంటారనేది తమ విశ్వాసమని కేటీఆర్ వ్యాఖ్యానించారు. తమ పార్టీ మేనిఫెస్టోలో సంక్షేమం, అభివృద్ధి రెండూ ఉన్నాయని కేటీఆర్ తెలిపారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి వంద సంవత్సరాలయ్యే 2047 నాటికి.. తెలంగాణ ఎలా ఉండాలనే క్లారిటీ తమకుందని చెప్పారు.
తెలంగాణపై కాంగ్రెస్, బీజేపీ ఆరోపణలపై కేటీఆర్ స్పందిస్తూ.. కాంగ్రెస్ తెలంగాణను ఇచ్చింది నాలుగు సీట్లు, ఓట్ల కోసమేనని ఆరోపించారు. అది నెరవేరనందున ఆ ఏడుపు ఉండడం సహజమని అన్నారు. బీజేపీకి ఒకటే సీటు వచ్చిందని. వాళ్ల ఏడుపు కూడా అత్యంత సహజమేనని పేర్కొన్నారు. ప్రజలు ఎంచుకున్న లక్ష్యాలు వంద శాతం నెరవేరాయని స్పష్టం చేశారు. ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరం ప్రాజెక్టును నరేంద్ర మోదీ (Narendra Modi) కట్టలేదని.. అదే విధంగా రాహుల్ గాంధీ (Rahul Gandhi), ఆయన ముత్తాత, నాయనమ్మ కూడా కట్టలేదని కేటీఆర్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది కేసీఆర్ అని కేటీఆర్ అన్నారు.
తెలంగాణలో తొమ్మిదిన్నరేళ్లలో 1.60 లక్షల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు పూర్తయ్యాయని కేటీఆర్ తెలిపారు. ఇంకా భర్తీ చేయాల్సినవి 72,000 అని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా తమ కంటే ఎక్కువ ఉద్యోగాలు భర్తీ చేసిన ప్రభుత్వం ఉంటే చూపించండని ప్రశ్నించారు. సంవత్సరానికి 16,000 నియామకాలు చేసిన ఘనత తమదని చెప్పారు. టీఎస్‌పీఎస్సీలో లోటుపాట్లుంటే.. తప్పకుండా ప్రక్షాళన చేస్తామని.. కచ్చితంగా ఏ ఏడాది ఖాళీలను ఆ సంవత్సరమే భర్తీ చేసేలా జాబ్ క్యాలెండర్‌ను ప్రకటిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.
'సంపద పెంచాలి- పేదలకు పంచాలనేదే కేసీఆర్ సిద్ధాంతం'
'దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణకు మధ్య పోటీ అంటూ రాహుల్ గాంధీ పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారు'