KTR Meeting with Students at Telangana Bhavan : రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం.. బలమైన నాయకత్వం ఉందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని.. అధిక సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్(BRS) విద్యార్థి విభాగంతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ చేసిన అభివృద్ధిని సెల్ఫీల రూపంలో వాట్సాప్ గ్రూపుల్లో పంపించాలని సూచించారు. ఐఐటీల్లో సీట్లు సాధించిన గురుకుల విద్యార్థులతో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేసి సామాజిక మాధ్యమాల్లో పెట్టాలని చెప్పారు.
KTR Reaction on Telangana Development : దేశంలో 3 శాతం జనాభా ఉన్నా.. 30 శాతం అవార్డులు తెలంగాణ సాధిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 33 వైద్య కళాశాలలు(Medical Colleges in Telangana) ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. దేశంలో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే అని కొనియాడారు. రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం.. బలమైన నాయకత్వం ఉందని అన్నారు. తలసరి ఆదాయంలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని తెలిపారు.
KTR Reaction on Jobs in Telangana : గతంలో 10 గంటలు కరెంట్ లేకపోయినా ప్రశ్నించలేదని.. ప్రస్తుతం 10 నిమిషాలు కరెంట్ లేకపోతే ట్విటర్‌లో పోస్టులు పెడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో రాష్ట్రానికి సంవత్సరానికి 1000 ఉద్యోగాలు మాత్రమే నియామకం చేసిందని.. బీఆర్‌ఎస్ గత 10 సంవత్సరాల్లో 1.32 లక్షల ఉద్యోగాలు భర్తీ ప్రక్రియ చేపట్టిందని పేర్కొన్నారు. మరో 90 వేల ఉద్యోగాలు వివిధ ప్రక్రియలో ఉన్నాయని అన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే టీఎస్‌పీఎస్సీ(TSPSC)ని ప్రక్షాళన చేస్తామని.. ప్రతి సంవత్సరం ఉద్యోగ నియామక ప్రక్రియ చేపడతామని హామీ ఇచ్చారు.
KTR Instructions to Students : ద్వితీయ శ్రేణి పట్టణాలకు ఐటీ హబ్‌లను ఏర్పాటు చేసి అభివృద్ధి చేశామని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో 2014లో పరిస్థితులు ఎలా ఉన్నాయని.. ప్రస్తుతం చాలా రంగాల్లో అభివృద్ధి చేశామని కేటీఆర్(KTR) వివరించారు. ఈ విషయాలను ప్రజలకు చేరవేయాలని విద్యార్థులను ఆదేశించారు. విద్యార్థులుగా కాకుండా తెలంగాణ ముద్దుబిడ్డలుగా అనుకుని ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.
"దేశంలో కులం, మతం పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తోంది.. తెలంగాణలో ఆ పరిస్థితి లేదు. కేంద్ర మంత్రి అమిత్ షా బీసీ నాయకుడిని ముఖ్యమంత్రి చేస్తామని అన్నారు.. మేము బీసీ మంత్రిత్వ శాఖ పెట్టమని అడిగితే ఇప్పటివరకు చేయలేదు. ప్రభుత్వ రంగ సంస్థలను బీజేపీ ప్రభుత్వం తీసేస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం బలోపేతం చేస్తుంది. కాంగ్రెస్‌కు 11 సార్లు అధికారం ఇస్తే రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు. నోట్ల కట్టతో దొరికిపోయిన వ్యక్తే ఇవాళ కేసీఆర్‌ని అమరవీరుల స్థూపం దగ్గరకు వచ్చి ప్రమాణం చేయమంటే హాస్యాస్పదంగా ఉంది."- కేటీఆర్, ఐటీ శాఖ మంత్రి