ఎడారి దేశంలో చిక్కుకున్న శ్రామికులు... తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చొరవతో క్షేమంగా రాష్ట్రానికి చేరుకున్నారు. సౌదీ అరేబియాలోని అల్అవామియా నగరంలో 11 మంది తెలంగాణ ప్రవాస కార్మికులు చిక్కుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న కేటీఆర్ చొరవతో స్వదేశానికి తిరిగొచ్చారు. కరీంనగర్ జిల్లా మల్లాపూర్‌కు చెందిన నర్సింగరావు, పొట్టెర్ల గంగయ్య, లింగం గౌడ్ సుదర్శన్, సాయన్న, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గంగన్న, జగిత్యాల జిల్లా వాసి రాచమల్ల బలరాం, హైదరాబాద్‌కు చెందిన తిప్పన సత్యనారాయణలు రెండేళ్ల క్రితం సౌదీకి వెళ్లారు. వీరు అక్కడ ఒక నిర్మాణ కంపెనీలో పనిచేశారు.
కేటీఆర్‌కు కార్మికుల కృతజ్ఞతలు...
ఏడాదిన్నర క్రితం ఈ సంస్థ మూతపడగా తర్వాత వారు పనుల కోసం తిరిగి ఇబ్బందులు పడ్డారు. వారి కుటుంబీకులు ఈ విషయాన్ని కేటీఆర్‌కు తెలిపారు. ఆయన సౌదీలోని రాయబార కార్యాలయం అధికారులతో మాట్లాడి వారికి సాయం చేయాలని కోరారు. కేటీఆర్ వినతిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, సాధారణ పరిపాలన శాఖ అధికారులు సౌదీలోని రాయబార కార్యాలయ అధికారులతో సంప్రదింపులు జరిపారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున కార్మికులకు టికెట్లను సమకూర్చటం వల్ల సౌదీలోని అధికారులు ఎగ్జిట్ వీసాలను ఇచ్చారు. వారంతా ఆదివారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. జీఏడీ అధికారులు వారికి రవాణా సౌకర్యం, రూ.వేయి చొప్పున సాయం అందించి, ఇళ్లకు పంపించారు. ఈ సందర్భంగా కార్మికులు తమను ఆదుకున్న కేటీఆర్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చూడండి : బీమా పత్రాలు కాదు... ఇక నుంచి ఎస్సెమ్మెస్‌లు...!