వనస్థలిపురం రైతుబజార్ సమీపంలో ప్రభుత్వం పేదలకు నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జైభవానీనగర్, రైతుబజార్ గుడిసెల ప్రాంతంలో రెండెకరాల విస్తీర్ణంలో ఈ ఇళ్లను నిర్మించారు. మొత్తం 2 ఎకరాల విస్తీర్ణంలో 324 ఇళ్ల నిర్మాణం చేపట్టారు. పేదలు ఆత్మగౌరవంతో నివసించేలా డబుల్ బెడ్ రూములను నిర్మించినట్లు కేటీఆర్ తెలిపారు. ఇప్పటివరకు ఏ ప్రభుత్వం ఇలాంటి ఇళ్లను నిర్మించి ఇవ్వలేదని... సకల సౌకర్యాలతో ఇళ్లను తీర్చిదిద్దినట్లు వెల్లడించారు.
28 కోట్ల వ్యయంతో మొత్తం రెండు ఎకరాల విస్తీర్ణంలో... 3 బ్లాకుల్లో.... 9 ఫ్లోర్లు, సెల్లార్లతో నిర్మించిన 324 గృహాలను నిర్మించారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వానికి దాదాపు 8 లక్షల 65 వేల రూపాయల వ్యయమైనట్లు అధికారులు పేర్కొన్నారు. ఇళ్లలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించారు. తాగునీరు, విద్యుత్ సరఫరా కల్పించారు. భూగర్భ మురుగు నీటి వ్యవస్థను ఏర్పాటు చేశారు. లిఫ్ట్, సీసీ రోడ్లు, వీధి దీపాలు ఏర్పాటు చేశారు. రెండు పడక గదుల ఇళ్లు అందివ్వడం పట్ల లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గుడిసెల్లో నివసించే వారికి ప్రభుత్వం డబుల్ బెడ్‌రూములు ఇచ్చిందని అంటున్నారు.
హైదరాబాద్ పరిధిలో రెండు పడక గదుల ఇళ్లను ప్రభుత్వం దశల వారీగా పేదలను అందిస్తోంది. ఇటీవల దసరా పండగ సందర్భంగా హైదరాబాద్‌లోని జియాగూడలో రెండు పడక గదులను కేటీఆర్ ప్రారంభించారు. కాలనీలో 840 రెండు పడక గదుల నివాసాలను ప్రభుత్వం నిర్మించింది. తొలి ప్రాధాన్యతగా 568 ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించారు.
ఇదీ చూడండి: పోలీస్ ఉద్యోగం కోసం ప్రభుత్వం ఉచిత శిక్షణ