KTR Harish Rao Compete For Majority Votes in Telangana 2023 : తెలంగాణలో ఎన్నికల కోలాహంల మొదలైంది. ఈ నేపథ్యంలోనే అనూహ్యంగా, సంచలనం లాంటివి ఏమైనా జరిగితే తప్పించి.. రాష్ట్ర ఎన్నికల్లో విజేతలు ముందే ఖాయమైన నియోజకవర్గాలుగా చెప్పగలిగినవి .. సిద్దిపేట, సిరిసిల్ల! కేటీఆర్, హరీశ్‌రావులు గెలుస్తారా అని కాకుండా ఎంత మెజార్టీ సాధిస్తారు అనేదే ఇక్కడ అసలు ప్రశ్న! ఇంకా చెప్పాలంటే.. వీరి ఇరువురి మధ్య కనిపించని ఓ ఆసక్తికర పోటీ ఉంది. అదే ఎవరికి ఎక్కువ మెజార్టీ వస్తుందని? బీఆర్ఎస్ సర్కారుకు రెండు చక్రాల్లాంటి వారు కేటీఆర్, హరీశ్‌రావు.
KTR Contest From Sircilla : సిరిశాల అనే కుగ్రామం నుంచి నేడు జిల్లా కేంద్రంగా మారింది. మరనేత, చేనేత వస్త్ర ఉత్పత్తులకు నిలయమిది. ఈ నియోజకవర్గం నుంచి 2009, 2010(ఉపఎన్నిక), 2014, 2018 ఎన్నికల్లో వరుసగా గెలుపొందుతున్న కేటీఆర్ (Minister KTR) .. మరోసారి భారీ విజయంపై ఫోకస్ పెట్టారు.2009 ఎన్నికల్లో బీఆర్ఎస్(టీఆర్ఎస్) తిరుగుబాటు అభ్యర్థిగా బరిలోకి దిగిన కేకే మహేందర్‌రెడ్డి... కేటీఆర్(KTR)కు గట్టి పోటీ ఇచ్చారు. కేవలం 171 ఓట్ల వ్యత్యాసంతోనే ఓటమి పాలయ్యారు.
తర్వాత 2010 ఉప ఎన్నికల నుంచి వరుసగా కాంగ్రెస్ తరఫున మహేందర్‌రెడ్డి పోరాటం చేస్తున్నారు. తొలి పోటీలో స్వల్ప మెజార్టీతో విజయం సాధించిన కేటీఆర్... 2010లో 68,000.. 2014లో 53,004... 2018లో 89,009 ఆధిక్యంతో కేకేపై గెలుపొందారు. మరోసారి హస్తం పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కేకే మహేందర్‌రెడ్డి గెలుపు కోసం శ్రమిస్తున్నారు. తరచూ అభ్యర్థులను మారుస్తున్న బీజేపీ.. ఈసారి రాణిరుద్రమను పోటీలో నిలిపి సత్తా చాటాలనుకుంటోంది.
కారు స్పీడ్ పెంచిన నేతలు - గులాబీ జెండాకు మద్దతివ్వాలంటూ ఊరూవాడా ప్రచారం
సాయం అడిగితే చాలు : కేటీఆర్ మంత్రిగా, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సిరిసిల్ల నియోజకవర్గ కష్టసుఖాలను ఎప్పుడూ పట్టించుకుంటారని, సాయం అడిగితే చాలు పరిష్కరించడానికి ముందుంటారనే పేరుంది. నియోజకవర్గంలో ఏ కార్యక్రమమైనా ఆయన హాజరవుతారు. గ్రామాల్లో పర్యటించినప్పుడు స్థానికుల కష్టసుఖాలను తెలుసుకుని, తన అనుచరులతో వారి సమస్యలను పరిష్కరించేలా చొరవ చూపుతారు.
విపక్షాల ప్రచార జోరు - అధికార పక్షంపై విమర్శల తూటాలు
ఏదైనా సమస్యను సోషల్ మీడియా ద్వారా కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లినా... వెంటనే స్పందిస్తారు. ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తూ నియోజకవర్గాన్ని తొమ్మిదిన్నరేళ్లలో ఆదర్శంగా నిలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram project) ద్వారా దశల వారీగా అన్నపూర్ణ, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, మల్కపేట జలాశయాల నుంచి గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, తంగళ్లపల్లి, ముస్తాబాద్, వీర్నపల్లి మండలాలకు సాగునీటిని తీసుకొచ్చారు.
నేతన్నలకు సంవత్సరం పొడవునా ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో.. సంక్షేమ శాఖలకు అవసరమైన వస్త్ర ఉత్పత్తుల ఆర్డర్లను సింహభాగం ఇక్కడి మరమగ్గాల పరిశ్రమకు కేటాయిస్తున్నారు. చేనేత మరమగ్గాల ఆధునికీకరణతోపాటు కార్మికులకు ప్రోత్సాహకాలను అందిస్తున్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంగా అవతరించడం, మెడికల్, నర్సింగ్ కాలేజీలు రావడం, పట్టణంలో చేపట్టిన అభివృద్ధి పనులు కేటీఆర్‌పై సానుకూలతను పెంచాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొందరు ద్వితీయ శ్రేణి నేతలు, కిందిస్థాయి శ్రేణుల మధ్య సయోధ్య లేకపోవడం కొంత ప్రతికూలంగా మారే అవకాశాలున్నట్లు సమాచారం.
గత ఎన్నికల్లో ఆధిక్యం 89,009
సిరిసిల్ల నియోజకవర్గం ఓటర్లు..
- మొత్తం: 2,44,426
- పురుషులు: 1,19,663
- మహిళలు: 1,24,756
- యువ ఓటర్లు: 1,14,072
- బీసీ ఓటర్లు: 55 శాతం పైగా
2018లో ఫలితాలు ఇలా..
- బీఆర్ఎస్ (కేటీఆర్): 1,25,213 ఓట్లు
- కాంగ్రెస్ (కేకే మహేందర్‌రెడ్డి): 36,204 ఓట్లు
- బీజేపీ (మల్లుగారి నర్సాగౌడ్): 3,243 ఓట్లు
సిద్దిపేట నియోజకవర్గం : అక్కడ ప్రత్యర్థులకు గత ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కలేదు. 1985 నుంచి కేసీఆర్.. 2004 ఉపఎన్నిక నుంచి ఆయన మేనల్లుడు హరీశ్‌రావు వరుసగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం అది. దాదాపు 38 సంవత్సరాలుగా వారికి కంచుకోటగా ఉన్న స్థానం. అదే సిద్దిపేట.. ఇక్కడ మూడు ఉపఎన్నికలతో కలిపి ఇప్పటివరకు డబుల్ హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసిన మంత్రి హరీశ్‌రావు (Minister Harish Rao).. ప్రస్తుతం ఏడోసారి బరిలో నిలిచారు. గత ఎన్నికల్లో ఇక్కడ పోలైన ప్రతి 10 ఓట్లలో.. దాదాపు 8 ఆయనకే పడగా.. తెలంగాణలోనే అత్యధిక మెజార్టీ (1,18,699) సాధించిన నియోజకవర్గంగా నిలిచింది.
ఓరుగల్లు పోరులో విజయం ఎవరిది- అనుభవానిదా, యువతరానిదా?
Harish Rao Contest From Siddipet : ఇప్పుడు మరోసారి రికార్డు మెజార్టీపై హరీశ్‌రావు దృష్టిసారించారని విశ్లేషకులు అంటున్నారు. ప్రత్యర్థులుగా కాంగ్రెస్ నుంచి విద్యార్థి ఉద్యమ నేపథ్యమున్న పూజల హరికృష్ణ, బీజేపీ అభ్యర్థిగా పార్టీ జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్‌రెడ్డి బరిలో ఉన్నారు. గట్టి పోటీ ఇవ్వాలనే లక్ష్యంతో ఇరువురూ కృషి చేస్తున్నారు.
ప్రజలతో మమేకం : తెలంగాణ ఏర్పాటు తర్వాత హరీశ్‌రావు మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయినా వారంలో మూడు రోజులు నియోజకవర్గంలో ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండడం హరీశ్‌రావు ప్రత్యేకతగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. సిద్దిపేట జిల్లా ఏర్పాటుతో పాటు నియోజకవర్గానికి రైలు సదుపాయం, ఆధునిక రైతుబజారు, సమీకృత విపణి, ఐటీ హబ్, రంగనాయకసాగర్ జలాశయం నిర్మాణం, స్వచ్ఛబడి, కోమటిచెరువు మినీ ట్యాంక్‌బండ్ తదితర అభివృద్ధి పనులు ఆయన హయాంలోనే సాకారమయ్యాయి. తెలంగాణలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దారనే పేరు ఉంది.
బీఆర్ఎస్‌లో ముఖ్యనేతగా.. స్టార్ క్యాంపెయినర్‌గా హరీశ్‌రావు ఉన్నారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో.. ఆయన సిద్దిపేటలో ఇప్పటివరకూ ఇక్కడ ప్రత్యక్షంగా ప్రచారం చేపట్టలేదు. హరీశ్‌రావు తరఫున పార్టీ శ్రేణులే ఆ బాధ్యతలు నిర్వహిస్తున్నాయి. వంద ఓటర్లకు ఒకరు చొప్పున పార్టీ యువ, సీనియర్ నాయకులకు హరీశ్‌రావు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే పలు గ్రామాలు, వివిధ కుల, ఇతరత్రా సంఘాలు మద్దతుగా నిలుస్తామంటూ ఏకగ్రీవ తీర్మానాలు చేశాయి.
గత ఎన్నికల్లో ఆధిక్యం 1,18,699
- మొత్తం ఓటర్లు: 2,33,733
- పురుషులు: 1,15,346
- మహిళలు: 1,18,317
- యువత: 1.20 లక్షలు
- బీసీలు: 55 శాతానికి పైగా
2018లో ఫలితం..
- బీఆర్ఎస్ (హరీశ్‌రావు): 1,31,295 ఓట్లు
- టీజేఎస్ (భవానీరెడ్డి): 12,596 ఓట్లు
- బీజేపీ (నరోత్తంరెడ్డి): 11,266 ఓట్లు