KTR Fires on Congress Government : తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణ కోసం, దిల్లీలో గులాబీ జెండా ప్రాతినిథ్యం ఉండాల్సిందేనని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ సరళిని పరిశీలిస్తే, నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో ఓట్ల పరంగా భారత్ రాష్ట్ర సమితి మొదటి స్థానంలో ఉందని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో త్రిముఖ పోరు ఉండే అవకాశం ఉందని వివరించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో నిజామాబాద్ లోక్‌సభ స్థానం సన్నాహక సమావేశంలో (Nizamabad LokSabha Meeting) ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు, కార్యకర్తలకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.
KTR Speech at Nizamabad LokSabha Meeting : అసెంబ్లీ ఫలితాలతో సంబంధం లేకుండా తెలంగాణ ప్రజల ప్రయోజనాలు, ప్రాతినిధ్యం కోసం రానున్న లోక్‌సభ ఎన్నికల్లో గట్టిగా కొట్లాడితే విజయం సాధించగలమని కేటీఆర్ (KTR) అన్నారు. బీఆర్ఎస్‌కు గెలుపు ఓటములు కొత్త కాదని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలవడానికి అడ్డగోలుగా 420 హామీలు ఇచ్చి, ఇప్పటికే పలు హామీలపై మాట దాటేస్తోందని ఆరోపించారు. అసెంబ్లీ సాక్షిగా నిరుద్యోగ భృతి ఇవ్వలేమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తప్పించుకునే ప్రయత్నం చేశారని కేటీఆర్ విమర్శించారు.
బీఆర్ఎస్ హయాంలో 50 లక్షల కోట్ల సంపద సృష్టించాం - కావాలని బద్నాం చేస్తున్నారు : కేటీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు, శ్వేత పత్రాల పేరుతో తప్పించుకునే డ్రామాలు చేస్తున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. పేద ప్రజల కోసం ఉద్దేశించిన అనేక సంక్షేమ కార్యక్రమాలను, హస్తం పార్టీ రద్దు చేసేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. దళితబంధు, బీసీబంధు, గృహలక్ష్మి, ఇతర సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేస్తే, ఆయా లబ్ధిదారులతో కలిసి తమ పార్టీ పోరాటం చేస్తుందని కేటీఆర్ తెలిపారు.
పేదలు, దళితులు, బీసీల ప్రయోజనాలకు దెబ్బకొట్టేలా కుట్ర చేస్తే, బీఆర్ఎస్ తరపున కొట్లాడుదామని కేటీఆర్ పేర్కొన్నారు. రైతుబంధు డబ్బులు వేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రజలను ఇబ్బంది పెట్టేలా లైన్లలో నిలబెట్టే దుస్థితికి ఆ పార్టీ తీసుకొచ్చిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అస్తవస్త్య పనితీరు, పరిపాలనను ఎప్పటికప్పుడు ఎండగట్టేలా పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని కేటీఆర్ సూచించారు.
దేశానికి టార్చ్ బేరర్‌గా మారిన తెలంగాణ జ్యోతిని ఆరిపోనివ్వం : కేటీఆర్
LokSabha Elections 2024 : పార్టీ పనితీరు పరంగా కూడా కొన్ని మార్పులు, చేర్పులు అవసరమని కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు కార్యకర్తల ఆకాంక్షలకు అనుగుణంగా ఖచ్చితంగా మార్చుకుంటామని పేర్కొన్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం గతంలో అయినా, భవిష్యత్ లోనైనాకొట్లాడేది భారత్ రాష్ట్ర సమితి మాత్రమేనని కేటీఆర్ స్పష్టం చేశారు.
రాష్ట్ర హక్కుల కోసం కొట్లాడటం కాంగ్రెస్, బీజేపీ వల్ల కాదు : కేటీఆర్
బీఆర్ఎస్ ఎంపీలు గెలవకపోతే పార్లమెంటులో తెలంగాణ పేరు అనామకం అవుతుంది : కేటీఆర్