Tomatoes Distribution On KTR birthday celebrations : బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. తమ అభిమాన నాయకుడు కేటీఆర్ బర్త్ డే పురస్కరించుకొని కొందరు రక్త దాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. మరికొందరు పాలభిషేకం చేసి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. కొందరు రైతులైతే ఏకంగా వరి నారుతో కేటీఆర్ పేరు వచ్చేలా ప్రత్యేకంగా అలంకరించి రామన్నకు బర్త్ డే విషెష్ చెప్పారు.
మరి కొందరు బీఆర్ఎస్ నేతలు ఈసారి తమ అభిమాన నాయకుడు కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలను వినూత్నంగా చేయాలని ఆలోచించి మరో అడుగు ముందుకేశారు. టమాటా పేరు చెబితేనే ఆమడ దూరం వెళ్లిపోతున్న వినియోగ దారుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి టమాటాలు పంచడానికి సిద్ధమైయ్యారు. హైదరాబాద్‌లోని బాలానగర్ డివిజన్లో కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మహిళలకు, జీహెచ్ఎంసీ సిబ్బందికి స్థానిక కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి టమాటాలను పంచిపెట్టారు.
KTR birthday celebrations tomatoes Distribution : అనంతరం భారీ కేక్‌ను కట్ చేసి చిన్నారులు, మహిళలకు పంచిపెట్టారు. దేశవ్యాప్తంగా టమాటా రేట్లు పెరిగిన నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా టమాటాలను పంచుతున్నట్లు రవీందర్ రెడ్డి వెల్లడించారు. తమ అభిమాన నాయకుడు కేటీఆర్ ఇలాంటి మరెన్నో పట్టిన రోజు వేడుకలు జరుపుకోవాలని ఆయన మనస్ఫూర్తిగా కోరుకున్నారు.
మరోవైపు కేటీఆర్ బర్త్ డే సందర్భంగా ముషీరాబాద్‌లోనూ ఎమ్మెల్యే ముటా గోపాల్ టమాటాలను పంచిపెట్టారు. పార్శి గుట్ట సమీపంలో బీఆర్ఎస్ నాయకుడు సోమన్న నేతృత్వంలో వినూత్నంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే.. సీఎం కేసీఆర్ చేపట్టిన అనేక సంక్షేమ పథకాలు దేశంలో చాలా రాష్ట్రాలు పాటిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. తెలంగాణాను ప్రపంచ పటంలోకి తీసుకువెళ్లే దిశగా మంత్రి కేటీఆర్ చేస్తున్న కృషి అనిర్వచనీయమని కొనియాడారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ యువ నాయకుడు ముటా జయసింహ, సోమన్న తదితరులు పాల్గొన్నారు.
క్యూ కట్టిన మహిళలు: కేటీఆర్ జన్మదిన వేడుకలను ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. వరంగల్ చౌరస్తాలో భారత రాష్ట్ర సమితి రాష్ట్ర నాయకులు రాజనాల శ్రీహరి కేటీఆర్ జన్మదిన వేడుకలను వినూత్నంగా నిర్వహించారు. టమాటా రేటు సామాన్యులకు అందనంత ఎత్తులో ఉన్న నేపథ్యంలో మహిళలకు టమాటా బుట్టలను పంచి పెడుతూ కేటీఆర్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. రేట్లు అధిక సంఖ్యలో ఉండటంతో మహిళలు టమాటాలను తీసుకోవడానికి పోటీ పడగా.. స్వల్ప తోపులాటలు జరిగాయి. కార్యకర్తలు వారిని నిలువరించి సజావుగా కార్యక్రమం జరిగినట్లు చూశారు.
ఇవీ చదవండి: