KRMB Committee Meeting: ట్రిబ్యునల్ అవార్డులకు లోబడే శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల రూల్ కర్వ్స్ ఉంటాయని... ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ఈఎన్సీ నారాయణ రెడ్డి అన్నారు. కృష్ణానదీ యాజమాన్య బోర్డు జలశయాల పర్యవేక్షణ కమిటీ రెండో సమావేశం హైదరాబాద్ జలసౌధలో జరిగింది. కేఆర్ఎంబీ సభ్యుడు రవికుమార్ పిళ్లై నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో ఏపీ ఈఎన్సీ, జెన్కో అధికారులు హాజరయ్యారు. తెలంగాణ అధికారులు సమావేశానికి గైర్హాజరు అయ్యారు. కేంద్ర జలసంఘం సంచాలకులు రిషి శ్రీవాస్తవ దృశ్యమాధ్యమం ద్వారా సమావేశంలో పాల్గొన్నారు.
శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల రూల్ కర్వ్స్, జల విద్యుత్ ఉత్పత్తి, వరద సమయంలో నీటి లెక్కింపు సహా సంబంధిత అంశాల విధివిధానాలపై చర్చించారు. రూల్ కర్వ్స్ ముసాయిదాపై ఏపీ అధికారులు కొన్ని వివరణలు అడిగారు. జల విద్యుత్ ఉత్పత్తి, వరద సమయంలో నీటి లెక్కింపునకు సంబంధించి కూడా సమావేశంలో చర్చించారు. ముసాయిదా అభిప్రాయాలను తెలంగాణకు పంపించి వారి అభిప్రాయాలు కూడా తీసుకుంటామని కమిటీ కన్వీనర్ పిళ్లై చెప్పినట్లు సమాచారం. జూన్ మొదటివారంలో కమిటీ మరోమారు సమావేశం కానుంది. ఆ తర్వాత ముసాయిదాకు ఆమోదం తెలిపి బోర్డుకు నివేదించనున్నారు. జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని రెండు రాష్ట్రాలకు ఉభయతారకంగా రూల్ కర్వ్స్ ఉంటాయని ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి చెప్పారు.
ఇవీ చదవండి: