Telangana Projects Water Levels : ఎగువ ప్రాంతాల్లో, రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల ఉద్ధృతితో కృష్ణా పరివాహక ప్రాంత ప్రాజెక్టుల్లోకి నీరు చేరుతోంది. ఆలమట్టిలోకి లక్ష క్యూసెక్కులకు పైగా ఇన్‌ఫ్లో వస్తోంది. భీమ నుంచి వస్తున్న వరదతో జూరాల నిండుకుండల మారింది. జెన్ కో అధికారులు జల విద్యుదుత్పత్తి ప్రారంభించారు. కాస్త ఆలస్యంగానైనా ప్రాజెక్టు నిండుతుందనే ఆశతో నాగార్జునసాగర్ ఆయకట్టుదారులు ఎదురుచూస్తున్నారు.
Krishna Projects Inflow : ఎట్టకేలకు కృష్ణాపరివాహక ప్రాజెక్టుల్లోకి వరద ప్రవాహం మొదలైంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో పాటు రాష్ట్రంలో పడుతున్న వానలతో.. ప్రాజెక్టుల్లోకి వరద చేరుతోంది. ఆలమట్టిలోకి లక్ష క్యూసెక్కులకు పైగా ఇన్ ఫ్లో వస్తుండగా.. ప్రాజెక్టు నీటి నిల్వ 55 టీఎంసీలకు చేరువైంది. జూరాలకు భీమా నుంచి వస్తున్న వరదతో ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టానికి చేరింది. జూరాల ఎగువ, దిగువ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో కరెంట్ తయారీ ప్రారంభించారు. మొత్తం 9 యూనిట్ల ద్వారా ఉత్పత్తి చేస్తున్నట్లు అధికారులు వివరించారు.
SRSP Water Level Today : గోదావరి పరివాహక ప్రాజెక్టుల్లోకి ఇంకా వరద కొనసాగుతూనే ఉంది. నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు స్వల్ప వరద కొనసాగుతోంది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ప్రస్తుత ఇన్ ఫ్లో 15,777 క్యూసెక్కులకు పడిపోయింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులకు గానూ ప్రస్తుతం ప్రాజెక్టులో 1083.50 అడుగుల వరద నీరు ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 90.3 టీఎంసీలకు గానూ ప్రస్తుతం 62.334 టీఎంసీల నీటి నిల్వ ఉంది.
Nizam Sagar Water Level Today : నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ప్రవాహం తగ్గుముఖం పట్టింది. ప్రాజెక్టులోకి 3,300 క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. ప్రస్తుత నీటిమట్టం 1,400.02 అడుగులు ఉండగా.. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 1,405 అడుగులు. అలాగే ప్రాజెక్టు ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 11.383 టీఎంసీలు.. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 17.802 టీఎంసీలుగా ఉంది. కడెం, ఎల్లంపల్లి, సింగూరు ప్రాజెక్టుల్లోకి ఇన్ ఫ్లో వస్తూనే ఉంది. ఎగువన వర్షాలు తగ్గడం వల్ల.. భద్రాచలం వద్ద గోదావరి క్రమంగా శాంతిస్తోంది.
రాష్ట్రంలో వచ్చే మూడురోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళ, బుధవారాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ రెండు రోజులకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ మాత్రం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
ఇవీ చదవండి: