కృష్ణా, గోదావరి నదుల యాజమాన్య బోర్డు సమావేశాలు హైదరాబాద్ జలసౌధలో వేర్వేరుగా నిర్వహించారు. కృష్ణానది నుంచి వచ్చే వరదలను దృష్టిలో పెట్టుకుని ఏపీకి 66 శాతం, తెలంగాణకు 34 శాతం నీటిని కేటాయిస్తామని బోర్డు ఛైర్మన్ ఆర్కే గుప్తా తెలిపారు. పొరుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్న నేపథ్యంలో భారీగా వరదలు వస్తున్నాయన్నారు. మూడు నెలల కోసం రాష్ట్రానికి 103 టీఎంసీల నీరు కావాలని..నెల రోజుల నిమిత్తం ఏపీకి 38 టీఎంసీలు అవసరమని ఇరు రాష్ట్రాల అధికారులు కోరినట్లు వెల్లడించారు.
త్వరలో నిర్వహించబోయే త్రిసభ్య కమిటీ భేటీలో ఈ మేరకు నీటి వనరుల కేటాయింపులు ఉంటుందన్నారు. బోర్డు కార్యాలయం తెలంగాణలోనే ఉండాలని కోరారని..ఈ అంశం కేంద్ర జలశక్తి మంత్రికి నివేదిస్తామని పేర్కొన్నారు. కృష్ణానదిపై నిర్మించిన ప్రాజెక్టులన్నీ బోర్డు అధీనంలోకి తీసుకురావాలన్న ఏపీ ప్రతిపాదనను తెలంగాణ తోసిపుచ్చిందన్నారు.
గోదావరి నది యాజమాన్య బోర్డు సమావేశంలో కేవలం సాంకేతిక విషయాలపై చర్చించామని గోదావరి నది యాజమాన్య బోర్డు ఛైర్మన్ ఆర్కే జైన్ స్పష్టం చేశారు. గోదావరి నదీ జలాలపై చర్చ జరగలేదని ఆయన తెలిపారు. ఏపీ ఇరిగేషన్ కార్యదర్శి ఈ సమావేశానికి గైర్హాజరు కావడమే కారణమన్నారు. గోదావరి నది నుంచి కృష్ణా నదికి నీటి తరలింపుపై తమకు ఎలాంటి ప్రతిపాదనలు అందలేదన్నారు. గోదావరి నుంచి కృష్ణా నది అనుసంధానంపై ఈ నెల 14 లేదా 19 తేదీల్లో ఇరు రాష్ట్రాల ఇంజినీర్ల సమావేశం ఉంటుందని వివరించారు.
ఇవీ చూడండి : నాగార్జున సాగర్‌కు వరద... రైతుల్లో ఆశలు