KondalRao Who is Excelling As a Young Writer: తన కళ్ల ముందు జరిగే సంఘటనల్ని.. కదిలించే సన్నివేశాల్ని.. కవితలుగా రాస్తూ నేటి తరంలో మేటి రచయితగా రాణిస్తున్నాడు ఈ యువకుడు. సివిల్స్ లక్ష్యంగా ముందుకు సాగి.. అనూహ్య పరిస్థితుల్లో ఇటువైపు మళ్లాడు. చదివింది హిస్టరీ అయినా తెలుగు భాషపై మంచి పట్టు, సాహిత్యంపై మక్కువతో భాషాభిమాని అనిపించుకున్నాడు. ఇప్పటికే 3 పుస్తకాలు రాసి పలువురి ప్రశంసలు అందుకుంటూ.. సినిమా రచయితగానూ అరంగేట్రం చేసి బంగారు భవితకు బాటలు వేసుకుంటున్నాడు ఆ పాతికేళ్ల యువకుడు.
కలంతో కుస్తీ పడుతున్న ఈ యువకుడి పేరు అడ్డగళ్ల కొండల్‌రావు. తూర్పుగోదావరి జిల్లా వాడపాలె స్వస్థలం. తల్లిదండ్రులు బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చి కూరగాయల వ్యాపారం చేసేవారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బి.కాం డిగ్రీ చదివిన యువకుడు.. ఇందిరా గాంధీ ఓపెన్ యూనివర్సిటీలో హిస్టరీలో పీజీ పూర్తి చేశాడు. సమాజంలో జరిగే సంఘటలు, వాటి వెనక విషయాలను పరిశీలించి.. రచయితగా మారినట్లు చెబుతాడు.
"వాస్తవికం" పేరుతో తొలి వచనా కవిత్వం విడుదల: చిన్ననాటి నుంచి తెలుగుభాషపై మక్కువ కలిగిన యువకుడు.. చదువుకుంటూనే సరదాగా కవితలు రాయడం మొదలుపెట్టాడు.. వాటిని స్నేహితులు, సన్నిహితులకు వినిపించగా.. వారంతా కొండల్‌రావు ప్రతిభను అభినందించారు. దాంతో నూతనొత్తేజం పొంది.. పూర్తిస్థాయిలో రచనలవైపు దృష్టి సారించాడు. సాహిత్యంపై కాస్త పట్టున్న కొండల్‌రావు.. సునాయసంగా కవితలు అల్లేవాడు. ఈ క్రమంలోనే "వాస్తవికం" పేరుతో తన తొలి వచనా కవిత్వం సంపుటిని విడుదల చేశాడు.
వాస్తవికం రచనకు మిత్రులు, పలువురు సాహితీవేత్తల నుంచి అందిన ప్రోత్సాహంతో కొద్ది రోజుల్లోనే "చురకలు" పేరుతో మరో పుస్తకాన్ని రాశాడు కొండల్‌రావు. ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్, నవలా రచయిత యండమూరి ఆ పుస్తకానికి ముందుమాటలు రాసి కొండల్‌రావు భుజం తట్టారు. సమాజంలో జరిగే సంఘటలుగా కవితలు రాసే. యువకుడు.. చురకలు పుస్తకంలోని ఓ కవితను ఈ విధంగా చెబుతాడు.
మొదటి రచనకు ఎన్నో ఇబ్బందులు: కొండల్‌రావు రాసిన మొదటి రచనకు పబ్లికేషన్ పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదురు అయ్యాయి. దీంతో మిత్రుల సలహాతో సోషల్‌మీడియాలోనూ కవితలు రాయాలనుకొని కేఆర్ రైటింగ్స్ పేరిట ఇన్‌స్టాలో ఖాతా తెరిచాడు. కానీ పుస్తక రూపంలో ఉండే రచనకు ఎప్పటికీ జీవం ఉంటుందని భావించే కొండల్.. తెలిసిన వాళ్ల ప్రోత్సాహంతో చురకలు, సిరాయి చప్పుళ్లు కవిత సంపుటాలను పుస్తకాల రూపంలో తీసుకురాగలిగాడు.
అప్పటి వరకు సాదాసీదాగానే సాగిపోతున్న కొండల్ రావు జీవితంలోకి సినిమా ప్రవేశించింది. ఇన్‌స్టాలో కొండల్‌రావు రచనలను చూసిన యువ దర్శకుడు ఎదువంశీ గూడవల్లి తన సినిమాలో మాటలు రాసే అవకాశం కల్పించాడు. కొండల్‌రావు మాటలు కొత్తగా అనిపించడంతో శ్రీకారం దర్శకుడు కిషోర్, అశోక్ కోటిపల్లి లాంటి దర్శకులు ప్రోత్సహించి తమ బృందంలోకి తీసుకున్నారు. ప్రస్తుతం కొండల్ రావు మూడు చిత్రాలకు మాటల రచయితగా పనిచేస్తున్నాడు.
కళ కథలు, తూటాలు, బతుకెరిగిన బాటసారి ఇలా.. పది వరకు కొండల్ రావు పుస్తకాలు రాశాడు. అయితే యువ రచయితలకు తమ రచనలను ప్రచురించుకోవడం పెద్ద సమస్య కావడంతో ఎక్కువమంది ఇటువైపు మొగ్గు చూపడం లేదని చెబుతున్నాడు. యువ రచయితలను ప్రోత్సహించేందుకు భవిష్యత్‌లో తానే ఒక పబ్లికేషన్ స్థాపిస్తానంటున్నాడు.
చిన్నప్పటి నుంచి నేను సమాజంలో చూసిన మార్పులు, చేర్పులు ఇవ్వన్ని కలగలిపి జ్ఞపకాలు , నా ఇబ్బందులు కానీ, ఇవన్నిటిని చూసి మనం ఏదోకటి చేయ్యాలి. అని అనుకున్న తరహాలో చదువుకి సంబంధించి కాకుండా, ఇంకా ఏదైనా చేయ్యాలి అనుకున్నప్పుడు నేను రాయగలను అని నాకు అనిపించింది. మొదట్లో రెండు మూడు రాసిన తరువాత కొంత మంది నా సన్నిహితులు చాలా బాగా రాస్తున్నావు అనడంతో, ఇంకొంచం ఉత్సాహం పెరిగి ఒక పుస్తకం రాయాలి అనిపించింది. -అడ్డగళ్ల కొండల్‌రావు, యువ రచయిత
ఇవీ చదవండి: