Rajagopal Reddy Fire On Revanth Reddy : బీజేపీని వీడి.. తాను కాంగ్రెస్లో చేరుతానని వస్తున్న వార్తలను కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర ప్రజలను నమ్మించి మోసం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ను గద్దె దించడానికే.. తాను బీజేపీలోకి వచ్చానని స్పష్టం చేశారు. కర్ణాటక ఫలితాలను చూపించి.. కాంగ్రెస్లోకి మళ్లీ రావాలని తమ మిత్రులు అడుగుతున్నారని తెలిపారు. తాను బీజేపీని విడిచి కాంగ్రెస్లోకి వెళ్లే ప్రసక్తే లేదని.. కేవలం కేసీఆర్ను గద్దె దించడానికే బీజేపీతో దోస్తీ కట్టానని వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న రేవంత్రెడ్డి వంటి వారు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి దుష్ప్రచారంతోనే మునుగోడులో తనపై గెలిచారని ఆరోపించారు.
రేవంత్రెడ్డి బ్లాక్ మెయిల్ చేసి కోట్లు సంపాదన..: రేవంత్రెడ్డి బ్లాక్ మెయిల్ చేసి రూ.కోట్లు సంపాదించారని.. ఆర్టీఐను అడ్డం పెట్టుకొని బెదిరింపు రాజకీయాలు చేశారని కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ నుంచి తనకు ఆహ్వానం వస్తున్న మాట నిజమేనని.. కానీ తాను కాంగ్రెస్లో చేరేది లేదని స్పష్టం చేశారు. ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దని కార్యకర్తలు, పార్టీ శ్రేణులకు సూచించారు.
అవినీతిపరులపై కఠినంగా వ్యవహరించాలి?: కాంగ్రెస్ పార్టీలో రేవంత్రెడ్డి ఒక వలసవాది అని ఆయన తనలాంటి వాళ్లని కాంగ్రెస్లోకి ఆహ్వానించడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. ఒక లక్ష్యం కోసం తాను బీజేపీలో చేరానని, బీజేపీను వీడే ప్రస్తక్తే లేదని స్పష్టం చేశారు. బలమైన నేతలను బీజేపీ నాయకత్వం ఉపయోగించు కోవాలనేదే తన అభిప్రాయమన్నారు. కొత్తగా చేరిన వారికి కూడా అవకాశాలిస్తే.. బీజేపీ మరింత బలోపేతం అవుతోందని అభిప్రాయపడ్డారు. అవినీతి పరులపై కఠినంగా వ్యవహరించాలని.. ఆధారాలు కావాలంటే తామిస్తామని పార్టీకి చెప్పినట్లు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి వెల్లడించారు.
కర్ణాటక ఫలితాలు చూపించి.. మళ్లీ ఆ పార్టీలోకి పిలుస్తున్నారు: రాష్ట్రంలో కాంగ్రెస్ గెలవక ముందే విభేదాలు వస్తున్నాయని.. పదవుల కోసం కొట్లాడుకుంటున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాను డబ్బుల కోసం అమ్ముడుపోయే వ్యక్తిని కాదని.. పోరాడే వ్యక్తినని పేర్కొన్నారు. రేవంత్రెడ్డి నాయకత్వంలో పని చేసేందుకు తాను సిద్ధంగా లేనని రాజగోపాల్రెడ్డి తెలిపారు. తాము ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని.. అయినా టీడీపీలో 20 ఏళ్లు ఉండి కాంగ్రెస్లోకి వచ్చిన వ్యక్తితో తాను పని చేయాలా అని ప్రశ్నించారు.
ఇవీ చదవండి: