Komatireddy Rajagopal Reddy Fires On CM KCR : కాంగ్రెస్ అధిష్ఠానం అవకాశం ఇస్తే మళ్లీ మునుగోడు నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy) స్పష్టం చేశారు. పార్టీ అవకాశం ఇస్తే.. కేసీఆర్‌పై పోటీ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లోని మెయినాబాద్ ఫాంహౌస్‌లో ఆయన అనుచరులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, కేసీఆర్‌లపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
"ఈనెల 27న రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్(Rajagopal Reddy Join Congress)లోకి చేరుతున్నాను. ప్రజల అభీష్టం మేరకే కాంగ్రెస్‌లోకి వెళుతున్నాను. అవినీతి కేసీఆర్‌ను గద్దె దించాలంటే కాంగ్రెస్‌లో చేరాలని ప్రజలు సూచించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ప్రజలు అంటున్నారు. కాంగ్రెస్‌లో ఉంటేనే మీరు గెలుస్తారని ప్రజలు నాతో అన్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్నవారు ప్రజల నిర్ణయం ప్రకారమే నడుచుకోవాలి. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా నడుకోవడానికి నేను కేసీఆర్‌ను కాదు. అందుకే కాంగ్రెస్‌లో మళ్లీ చేరుతున్నా.. ఇదే నా జీవితంలో అతిపెద్ద నిర్ణయమని" కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.
Komatireddy Rajagopal Reddy Join Congress on October 27th : కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు నాయకత్వం, కొన్ని విషయాల్లో మాత్రమే రేవంత్ రెడ్డితో విభేదించానని.. అంతే తప్ప మరే విషయంలోనూ ఎలాంటి విభేదాలు లేవని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. అయితే పార్టీ కోసం, ప్రజల కోసం ఒక మెట్టు దిగుతానని రేవంత్ రెడ్డి కూడా అన్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలో నియంత పాలన అంతం కావాలన్నదే తన లక్ష్యమని.. ఈ పాలనపై పోరాటానికి అందరూ కలిసి రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ద్వారా మాత్రమే కేసీఆర్ దుర్మార్గపు పాలన అంతం అవుతుందని ప్రజలు అంటున్నారని తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరూ బీఆర్ఎస్కు మళ్లీ ఓటు వేసే పరిస్థితి లేదన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అనే నినాదం ప్రజల్లో బలంగా ఉందని ఆరోపించారు.
"మళ్లీ మునుగోడు నుంచి నేనే పోటీ చేస్తాను. ఎల్బీనగర్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని చెప్పి అక్కడ పోటీ చేయమన్నారు. కానీ నేను ఎక్కడ కూడా ఎల్బీనగర్ నుంచి పోటీ చేస్తానని చెప్పలేదు. పదవి ఉన్నా లేకున్నా.. మునుగోడు ప్రజలతోనే ఉంటా.. మునుగోడులోనే పోటీ చేస్తా. మునుగోడులో రాజగోపాల్ రెడ్డి ఓడిపోలేదు.. నైతిక విజయం సాధించాడు. కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశిస్తే గజ్వేల్‌లో కేసీఆర్‌ను ఓడిస్తాను. దమ్ముంటే కేసీఆర్ మునుగోడులో పోటీ చేయు.. లేకుంటే నేనే గజ్వేల్‌లో పోటీ చేస్తా." - కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మునుగోడు మాజీ ఎమ్మెల్యే
Telangana Assembly Election 2023 : దేశంలో అన్ని రంగాల అభివృద్ధిలో నంబర్ వన్‌గా ఉంటున్నామని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు కదా.. ఇవాళ తెలంగాణ ప్రభుత్వ అవినీతిలో మాత్రమే నంబర్‌వన్‌గా ఉందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. ఇందుకోసమే తెలంగాణ సమాజం మరోసారి ఆత్మగౌరవం కోసం పోరాడుతోందని స్పష్టం చేశారు. ఈరోజు తెలంగాణ ఉద్యమద్రోహులే కీలక పదవుల్లో ఉన్నారని.. ఉద్యమకారులు రోడ్డున పడ్డారని ఆవేదన చెందారు. కాంగ్రెస్ పార్టీలో ఏఐసీసీ, టీపీసీసీ అధ్యక్షు పదవులు ఎవరికైనా వస్తాయని.. బీఆర్ఎస్లో మాత్రం అధ్యక్ష పదవి ఇతరులకు ఎప్పుడూ రాదని దుయ్యబట్టారు.