సుదీర్ఘ స్వప్నం సాకారమైంది. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం కొహెడలో తాత్కాలిక మామిడి మార్కెట్ యార్డు ఏర్పాటైంది. హైదరాబాద్ గడ్డి అన్నారంలోని పండ్ల మార్కెట్.. కొహెడకు తరలింపు ప్రక్రియ యుద్ధ ప్రాతిపదికన సాగింది. నగర శివారులోని బాహ్యవలయ రహదారి పక్కన మార్కెట్ సిద్ధం కావడం వల్ల మామిడి క్రయ, విక్రయాలకు మార్గం సుగమమైంది.
కరోనా వ్యాప్తి కట్టడి, లాక్‌డౌన్ ఆంక్షల నేపథ్యంలో గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌లో భౌతిక దూరం పాటించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు.. కొహెడకు మార్కెట్ తరలింది. మూడేళ్లుగా ప్రతిపాదన ఉన్నా కమీషన్ ఏజెంట్లు పెద్దగా ఆసక్తి చూపకపోవడం.. మార్కెటింగ్ శాఖ చొరవ తీసుకోకపోవడం ఫలితంగా మార్కెట్ తరలింపు ఆలస్యమైంది.
కొహెడలో కొత్తగా ఏర్పాటైన మార్కెట్ ప్రాంగణంలో కనీసం ఒక్కటైనా పక్కా భవనం లేకపోవడం, తాగు నీరు, రోడ్లు, షెడ్లు, మురుగు నీటి నిర్వహణ వ్యవస్థ, విద్యుత్ లైన్లు, దీపాలు, ప్రహరీ గోడ వంటి కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడంపై రైతులు, ఏజెంట్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి చేతుల మీదుగా మే 2న కొహెడ మార్కెట్ ప్రారంభోత్సవం వేళ తాజా పరిస్థితిని ఈటీవీ భారత్ ప్రతినిధి మల్లిక్ అందిస్తారు.
ఇవీచూడండి: కరోనాపై పాట.. వీధులెంట తిరగకురోరన్నో...