రాష్ట్రంలో భూరికార్డుల సవరణలు అనేక సమస్యలకు దారి తీశాయని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండ రెడ్డి వ్యాఖ్యానించారు. రైతుబంధు కోసం ఎన్నికల ముందు ప్రభుత్వం హడావుడి నిర్ణయం తీసుకుందని... ఇప్పటికీ తొమ్మిది లక్షల మంది రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు అందలేదని మండిపడ్డారు. భూమి హక్కుదారులకు పట్టాదారు పాస్ పుస్తకాలు రాకపోవడంతో రెవెన్యూ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కిసాన్ కాంగ్రెస్ రైతు సమస్యలపై అనేకసార్లు రాత పూర్వకంగా ప్రభుత్వానికి నివేదించినా... పెడచెవిన పెట్టిందని దుయ్యబట్టారు. బ్యాంకు రుణాలు, విత్తనాలు, ఎరువులుగాని పొందాలన్నా.. పట్టాదారు పాసుపుస్తకం ఉండాలని అధికారులు చెబుతున్నారని, అవి లేక భూమి హక్కుదారులకు తీవ్ర నష్టం జరుగుతుందని పేర్కొన్నారు.
ఆ ఘటన దురదృష్టకరం...
అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ విజయారెడ్డి సజీవదహనం ఘటన దురదృష్టకరమన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం క్షేత్రస్థాయిలో రైతు సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి: ఇవాళ నాగోల్లో తహసీల్దార్ విజయారెడ్డి అంత్యక్రియలు