Kodanda Ram on TS Budget: రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌కు విలువ లేకుండా చేసి... భ్రష్టు పట్టించిందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ ధ్వజమెత్తారు. పద్దు అంచనాలకు కేటాయింపులకు పొంతన లేదని విమర్శించారు. హైదరాబాద్ నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన కోదండ రాం.. బడ్జెట్ అంచనాలు వాస్తవదూరంగా ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.
సస్పెన్షన్ ఎత్తేయాలి
ప్రజల నుంచి ఇష్టారీతిన వసూళ్లకు పాల్పడేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని కోదండ రాం ఆరోపించారు. ప్రతి నెలా పద్దుకు సంబంధించిన లెక్కలు తీసి ప్రభుత్వంపై పోరాటం చేస్తామని వెల్లడించారు. ప్రభుత్వం తక్షణమే భాజపా ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ ఎత్తివేసి సమావేశాలకు అనుమతించాలని డిమాండ్ చేశారు.
"బడ్జెట్ లెక్కలకు విలువ లేదు. రూ. 25 వేల కోట్లు నాన్ టాక్స్‌గా చూపిస్తున్నారు. ఇవి వస్తాయా అని గ్యారెంటీ లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి రూ. 41 వేల కోట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. దాదాపు 60 వేల కోట్లు అప్పు తెస్తున్నారు. వీటన్నిటినీ అంచనా వేసి రూ. 2 లక్షల 51 వేల కోట్ల బడ్జెట్ గా అంచనా వేశారు. అప్పులు పెరుగుతున్నాయి.. అంచనాలు తప్పుతున్నాయి. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా పెరుగుతోంది. ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. నిరుద్యోగులకు ఇస్తామన్న భృతి ఏమైంది.?" -కోదండ రాం, తెజస అధ్యక్షుడు
ఇక్కడే తక్కువ
రాష్ట్రంలో విద్యా, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పన సరిగా లేదని కోదండ రాం ఆరోపించారు. ఆ విషయంలో దేశంలో మిగతా రాష్ట్రాల కంటే తెలంగాణనే తక్కువగా ఖర్చు చేస్తుందని చెప్పారు. కుల వృత్తుల అభివృద్ధికి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి.. నిధులు కేటాయించలేదని కోదండ రాం విమర్శించారు.
ఇదీ చదవండి: KTR About Women Entrepreneurs : 'మహిళా పారిశ్రామికవేత్తల ఆలోచనలు ప్రపంచస్థాయిలో ఉండాలి'