Kodali Nani sensational Comments: ఏపీలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి.. గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘వివేకానంద రెడ్డి బతికున్నా, చనిపోయినా.. జగన్ మోహన్ రెడ్డి.. కడప ఎంపీ సీటును మాత్రం అవినాష్ రెడ్డికే ఇచ్చేవారు' అని అన్నారు. సోమవారం రాత్రి సీఎం జగన్.. తన కార్యాలయంలో ఎమ్మెల్యేలతో, మంత్రులతో, పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. సమావేశంలో భాగంగా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థుల గురించి, నామినేషన్ల గురించి చర్చించారు.
Kodali Nani sensational Comments on YS Viveka : అనంతరం కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. ‘వివేకానంద రెడ్డి బతికున్నా, చనిపోయినా జగన్ మోహన్ రెడ్డి.. కడప ఎంపీ సీటును అవినాష్ రెడ్డికే ఇచ్చేవారు. ఎందుకంటే కాంగ్రెస్‌కు రాజీనామా చేసి కడప ఎంపీగా జగన్, పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయమ్మ పోటీ చేస్తే వివేకానంద రెడ్డి ఆయన కుటుంబం జగన్ ప్రత్యర్థి పార్టీ తరపున నిలిచి వారిని ఓడించడానికి, సర్వనాశనం చేయడానికి ప్రయత్నించారు.
అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర రెడ్డి వైఎస్సార్సీపీ ఆవిర్భావం నుంచి జగన్ వెన్నంటి ఉండి ఆయన విజయం కోసం పాటుపడ్డారు. వారికే జగన్ సీటిస్తారు. అది జగన్ ఇష్టం. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 16న ప్రారంభం కాబోతుంది. ఈ ఎన్నికల్లో కూడా వైఎస్సార్‌సీపీనే ఏకపక్షంగా గెలుస్తుంది.’ అని కొడాలి నాని వ్యాఖ్యానించారు.
మరోవైపు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తును సుప్రీంకోర్టు.. ఇటీవలే ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ చేస్తూ తీర్పును వెలువరించింది. దీంతో సీబీఐ అధికారులు హత్య కేసుకు సంబంధించిన దర్యాప్తును వేగవంతంగా చేస్తున్నారు. తాజాగా సీఎం జగన్‌మోహన్ రెడ్డి, ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డి సీబీఐ ఎదుట హాజరయ్యారు. అవినాష్ రెడ్డి ఫోన్ కాల్ డేటా ఆధారంగా గతంలో కృష్ణ మోహన్ రెడ్డితో పాటు వైఎస్ భారతి ఇంట్లో పనిచేసే నవీన్‌కు కూడా సీబీఐ నోటీసులిచ్చి, విచారించింది. ఇటువంటి సమయంలో కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
ఇవీ చదవండి