సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా.. కేంద్ర ప్రభత్వం రాష్ట్రాల హక్కులను ఒక్కొక్కటి లాక్కుంటోందని తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు అన్నారు. బడ్జెట్ నేపథ్యంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆయనతో పాటు తెరాస లోక్‌సభా పక్ష నేత నామ నాగేశ్వరరావు పాల్గొన్నారు. సీఏఏ అమలులో రాష్ట్రాలకు వెసులుబాటు కల్పించాలని కోరినట్లు తెలిపారు. పౌరసత్వ సవరణ బిల్లుపై ముఖ్యమంత్రి కేసీఆర్ తెరాస వైఖరి స్పష్టం చేశారని పేర్కొన్నారు. ఆందోళనలు జరుగుతాయని కేసీఆర్ ముందే పరిస్థితిని ఊహించారని అన్నారు.
పార్లమెంట్ ఆమోదించిన బిల్లులపై ప్రజలు ఎందుకు రోడ్లపైకి వస్తున్నారో కేంద్రం చర్చ జరపాలని భేటీలో కోరినట్లు కేకే తెలిపారు. ఎన్పీఆర్పై కేంద్రం, భాజపా నేతలు చెబుతున్న మాటలతో గందరగోళం నెలకొందని తెలిపారు. ఆరేళ్లు గడుస్తున్న విభజన హామీలు పూర్తి కాలేదని.. ఏపీ విభజన చట్టంపై పూర్తి స్థాయిలో ఒక రోజు చర్చించాలని విజ్ఞప్తి చేసినట్లు నామ నాగేశ్వరరావు చెప్పారు.