Kisan congress on Dharani: దున్నేవాడికి భూమి ఇచ్చిన ఘనత ఇందిరాగాంధీదేనని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ అన్నారు. ధరణి పోర్టల్ ఎందుకు తీసుకొచ్చారో సీఎం కేసీఆర్ కైనా తెలుసా అని ప్రశ్నించారు. దొరలకు లాభం చేసేందుకే ధరణి ఆరోపించారు. హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్వంలో చేపట్టిన ధరణి రచ్చబండ కార్యక్రమంలో వీహెచ్ మాట్లాడారు.
నగరం చుట్టూ ఓఆర్ఆర్ వచ్చాకా భూముల రేట్లు విపరీతంగా పెరిగాయని వీహెచ్ అన్నారు. ఓఆర్ఆర్ చుట్టూ ఉన్న పేదల భూములను పెద్దలకు రాసిచ్చారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే లోపు ఉన్న భూములు మాయం చేస్తారని వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్లుండి హెచ్ఎండీఏ ముందు నిరసన చేపడతామని హెచ్చరించారు.
కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. పేదల భూములను దొరలు ఆక్రమిస్తున్నారు. ఓఆర్ఆర్ చుట్టూ భూములన్నీ కబ్జా చేస్తున్నారు. మేం అధికారంలోకి వచ్చేసరికి అన్ని భూములు కాజేస్తారు. ఇప్పటి నుంచే మనమంతా కలసికట్టుగా దీనిపై పోరాటం చేయాలి. - వీహెచ్, కాంగ్రెస్ సీనియర్ నేత
రాష్ట్రంలో భూ సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎస్ దృష్టికి సమస్యలు తీసుకెళ్లిన పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రెవెన్యూ రికార్డులను సవరించాలని డిమాండ్ చేశారు. భూసమస్యలతో రైతులు చనిపోతున్నారని.. హత్యలు కూడా జరుగుతున్నాయని కోదండరెడ్డి తెలిపారు. అబ్దుల్లాపూర్‌మెట్ ఎమ్మార్వో చనిపోవడానికి భూ సమస్యలే కారణమన్నారు. అసైన్డ్ భూములను అడ్డగోలుగా గుంజుకుంటున్నారన్న ఆయన... వాటిని వెంచర్లుగా వేసుకుని అధికార పార్టీ నేతలు కోట్లు సంపాదిస్తున్నారని కోదండ రెడ్డి ఆరోపించారు.
ప్రభుత్వంపై రైతులు పోరాడితే మేము అండగా ఉంటామని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క స్పష్టం చేశారు. ఎక్కడ భూములున్నా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పోడు రైతులపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ భూములు పంచితే.. తెరాస లాక్కుంటోందని సీతక్క ధ్వజమెత్తారు.
ఇవీ చదవండి: హైదరాబాద్‌కు మరో భారీ పెట్టుబడి.. కేటీఆర్ వెల్‌కమ్
విషమంగా లాలూ ఆరోగ్యం.. సీఎం పరామర్శ.. చికిత్స కోసం సింగపూర్‌కు!