కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డిని పోలీసులు అరెస్టు చేయడాన్ని కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి ఖండించారు. కోదండ రెడ్డితో పాటు గ్రామాల సర్పంచ్‌లను, రైతులను అరెస్టు చేయడం హేయమైన చర్యగా ఆయన ఒక ప్రకటనలో అభివర్ణించారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి గ్రామానికి స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి వస్తున్నట్లు తెలుసుకుని ఆయనతో మాట్లాడేందుకు వెళ్తుతుంటే పోలీసులు కోదండరెడ్డిని అడ్డుకుని అరెస్టు చేయడం ఏమిటని ప్రశ్నించారు.
ప్రశ్నించే గొంతుకలను నొక్కిపెట్టి విషం చిమ్మే ఫార్మాసిటీని ఏర్పాటు చేయాలని చూస్తున్న ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజు దగ్గర పడిందని హెచ్చరించారు. గ్రామాలకు పోలీసు బలగాలతో ఎమ్మెల్యే రావడం వల్ల గ్రామాల్లో భయానక వాతావరణం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల భూములు లాక్కోవాలనుకుంటే... కిసాన్ కాంగ్రెస్ చూస్తూ ఊరుకోదని... రైతుల పక్షాన పోరాటం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. అరెస్ట్ చేసిన కోదండరెడ్డిని, గ్రామ సర్పంచ్‌లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: టోలీచౌకి నదీమ్ కాలనీలో మంత్రి కేటీఆర్ పర్యటన